టీఎస్ ​పీఎస్సీ పోటీ వివిధ పరీక్షల్లో అక్రమాలు:కాంగ్రెస్

 టీఎస్ ​పీఎస్సీ పోటీ వివిధ పరీక్షల్లో అక్రమాలు:కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీపై యాంటీ కరప్షన్ బ్యూరో(ఏసీబీ)కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. గ్రూప్1తో పాటు టీఎస్ ​పీఎస్సీ నిర్వహించిన పోటీ వివిధ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఈ మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి గుప్తాకు శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ తరఫున పార్టీ నేతలు మల్లు రవి, బల్మూరి వెంకట్, మానవతారాయ్ ఫిర్యాదు కాపీని అందజేశారు. టీఎస్​పీఎస్సీ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు సాఫ్ట్​వేర్, కంప్యూటర్లను ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్​టీఎస్​) సరఫరా చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పేపర్ లీక్ కేసుకు 2015లోనే లింకులున్నాయని ఆరోపించారు. ఆనాడు టీఎస్​పీఎస్సీని సందర్శించిన మంత్రి కేటీఆర్.. సాఫ్ట్​వేర్, కంప్యూటర్లను అప్​గ్రేడ్ చేయాల్సిందిగా ఆదేశించడంతో టీఎస్​టీఎస్ వాటిని అప్​గ్రేడ్ చేసిందని గుర్తు చేశారు. పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి.. టీఎస్​టీఎస్ ఔట్​సోర్సింగ్ ఉద్యోగి అని పేర్కొన్నారు. కమిషన్​లోని పెద్దలకు తెలియకుండా పేపర్ లీక్ జరిగే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో డబ్బు చేతులు మారాయని, అవినీతి అక్రమాలు జరిగాయని.. కాబట్టి కేసును ఏసీబీ విచారించేందుకు అధికారం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసును సిట్ విచారిస్తున్నదని, ఎక్వైరీని మంత్రి కేటీఆర్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.