- కార్పొరేషన్లో గెలుపు గుర్రాలను దింపేందుకు కాంగ్రెస్ సీక్రెట్ సర్వే
- నెలరోజులపాటు వార్డుల్లో తిరిగిన బృందాలు.. తాజాగా రంగంలోకి మరో టీమ్
- నియోజకవర్గ 'బాస్' చేతికి రిపోర్ట్
- మేయర్‌గా పోటీ చేసేందుకు ఇద్దరు లీడర్ల మధ్య పోటాపోటీ
మహబూబ్‌నగర్, వెలుగు : కార్పొరేషన్, మున్సిపల్ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ఓటరు లిస్ట్, పోలింగ్స్టేషన్వివరాలను రిలీజ్ చేయగా.. ఈనెల 10న ఫైనల్ ఓటర్ జాబితాను రిలీజ్ చేయనుంది. 20లోపు ఆయా కార్పొరేషన్లలోని డివిజన్లు, మున్సిపాల్టీలో వార్డులవారీగా రిజర్వేషన్లను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు స్పీడప్ చేస్తోంది. ఈ తరుణంలో అధికార కాంగ్రెస్‌నుంచి పోటీ చేసేందుకు లీడర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో పార్టీ గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు సీక్రెట్ సర్వేలు
చేయిస్తోంది.
నెల రోజులు సాగిన సర్వే..
గతేడాది జనవరి 28న 60 డివిజన్లతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కార్పొరేటర్లు, మేయర్లుగా పోటీ చేయాలనుకుంటున్న వారి సంఖ్య అధికార పార్టీలో పెరుగుతూ వస్తోంది. ఏండ్లుగా పార్టీకి విధేయులుగా ఉన్న వారితోపాటు అధికారం మారాక పార్టీ కండువాలు కప్పుకున్న లీడర్లు సైతం ఎన్నికల్లో పోటీలో ఉంటామని చెప్పుకుంటున్నారు. దీంతో ఒక్కో డివిజన్ లో ఆరు నుంచి ఎనిమిది మంది ఆశావహులు తయారయ్యారు. అయితే ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగేవి కావడంతో.. ఒకరికి పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే రెబల్స్బెడద ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందస్తుగా గుర్తించిన నియోజకవర్గ 'బాస్' గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు సీక్రెట్ సర్వే చేయించారు.
డివిజన్ల వారీగా ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకపోయినా.. ముందస్తుగా ఆయా డివిజన్లలో ప్రజల నాడిని తెలుసుకునేందుకు సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. సర్వేలో ఆయా డివిజన్లలో ఏఏ లీడర్లు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు..? అక్కడ ఏ లీడర్‌కు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది..? వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి..? వారి సామాజిక ఓటర్లు ఎంత మంది ఉన్నారు..? ఆ ఓటర్ల సపోర్ట్ ఎవరికి ఉంది..? ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయాలనుకుంటున్నారు..? వారు పోటీకి దిగితే కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపోటములు ఎలా ఉండనున్నాయి..? అనే వివరాలను సర్వే టీమ్ నెల రోజులపాటు 60 డివిజన్లలో పర్యటించి సేకరించింది. ఈ రిపోర్టును ప్రస్తుతం నియోజకవర్గ 'బాస్' చేతికి చేరగా.. ఆయన హైకమాండ్‌కు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే కొద్ది రోజులుగా మరో సర్వే బృందం కూడా పాలమూరు కార్పొరేషన్లో పర్యటిస్తున్నట్లు సమాచారం.
మేయర్ పదవి కోసం పోటాపోటీ..
మహబూబ్‌నగర్ మేయర్ పదవి కోసం పోటాపోటీ నెలకొంది. కార్పొరేషన్ఏర్పాటైన మొదటిసారి జరిగే ఎన్నిక కావడంతో మేయర్‌పదవి చేపట్టి.. చరిత్ర సృష్టించాలని లీడర్లు భావిస్తున్నారు. ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ మాజీచైర్మన్, హన్వాడ మండలానికి చెందిన మరో సీనియర్లీడర్ మేయర్‌గా తమకే అవకాశం వస్తోందనే నమ్మకంతో ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక.. వారికి అనుకూలంగా ఉన్న డివిజన్ నుంచి పోటీ చేసి.. మేయర్ కుర్చీని దక్కించుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు లీడర్లు నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. వీలైనంత వరకు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ పోటీలో తామున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికి రిజర్వేషన్లు ఖరారు అయ్యాకే వీరిలో ఎవరు పోటీలో ఉంటారనేది తేలనుంది. ఈ స్థానం జనరల్‌కు రిజర్వ్ అయితే మాత్రం హైకమాండ్‌కు కొత్త తలనొప్పులు వచ్చి పడతాయని సొంత పార్టీ లీడర్లే చర్చించుకోవడం విశేషం.
ప్రభావం చూపనున్న బీసీలు, మైనార్టీలు..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలు, మైనార్టీలు ఆయా పార్టీల గెలుపోటములను తేల్చనున్నారు. వీరు వన్‌సైడ్‌గా ఎవరికి ఓట్లు వేస్తే.. వారినే విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. 60 డివిజన్లలో దాదాపు 25 నుంచి 35 డివిజన్లలో వీరి ప్రభావం ఉండనుంది. డ్రాఫ్ట్ఓటరు లిస్ట్ ప్రకారం ఈ కార్పొరేషన్లో 1,97,855 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 45 శాతం నుంచి 50 శాతం వరకు బీసీ ఓటర్లు ఉండగా.. ఆ తర్వాత 20 శాతం నుంచి 25 శాతం వరకు మైనార్టీ ఓటర్లు ఉన్నారు.
