- కాంగ్రెస్ లో టికెట్ కేటాయింపుపై రహస్యంగా ఆరా
- నోటిఫికేషన్ తర్వాత మరో రెండుసార్లు సర్వే!
- అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న కాంగ్రెస్
- హైకమాండ్ నిర్ణయం మేరకే ఎంపిక
ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. అన్ని పార్టీలు బల్దియా పరిధిలోని కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.
గెలుపు గుర్రాల కోసం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలి.. టికెట్ ఆశిస్తున్న ఆశావహుల బలాలు, పార్టీలో ఎంత వరకు పనిచేస్తున్నారనే దానిపై ఇప్పటికే సర్వే నిర్వహించింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సైతం ఇటీవల సర్వే ముగిసిందని జిల్లా ఇన్చార్జ్, ఉర్ధూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తాజాగా జిల్లా పర్యటనలో వెల్లడించారు. దీంతో అధికార పార్టీ నుంచి బరిలో ఎవరు నిలుస్తారనేది కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో రెండు సార్లు సర్వే చేసి అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించి ఎంపిక చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ద ఎత్తున దరఖాస్తులు
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు కార్యకర్తల నుంచి పార్టీ దరఖాస్తులు తీసుకుంటోంది. మంచిర్యాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 89, నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 80, ఆసిఫాబాద్‌లోని రెండు మున్సిపాలిటీల్లో 50 వార్డులు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 49 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటి వరకు 134 మంది ఆశవాహులు టికెట్ కోసం దరఖాస్తుల చేసుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 70 దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్ వచ్చేవరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దరఖాస్తులు చేసుకున్న వారిలో వార్డుకు ముగ్గురు పేర్లను పరిశీలించేందుకు హైకమాండ్ కు పంపనున్నారు.
ఇందులో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా ఆశావహులు పార్టీ కోసం పనిచేయాలని దరఖాస్తులు స్వీకరించే సమయంలోనే నేతలు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ బల్దియా పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో బలమైన మహిళా నేతలను జల్లెడపడుతున్నారు. మాజీ కౌన్సిలర్లు, సీనియర్లతో పాటు యువ నాయకులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ చైర్మన్ పీఠం దక్కించుకోగా ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తోంది.
కాంగ్రెస్ లో జోష్
అధికార పార్టీలో ప్రస్తుతం జోష్ కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించడం, రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆ పార్టీకి ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగింది. తాజాగా ఆదిలాబాద్ లో చనాఖా–కొరాట ప్రాజెక్టును, నిర్మల్ జిల్లాలో సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించడంతో పార్టీ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్.. మున్సిపల్ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. అందుకే టికెట్ సంపాదించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులు చేసుకొని రాష్ట్రస్థాయిలో నేతలతో టచ్‌లో ఉంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
