బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేల ఊళ్లలోనూ ‘హస్తం’దే హవా

బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యేల ఊళ్లలోనూ ‘హస్తం’దే హవా
  • ఉమ్మడి నల్గొండలో గులాబీ లీడర్లపై తీవ్ర వ్యతిరేకత
  • అన్ని గ్రామాల్లో కాంగ్రెస్​కు బంపర్ మెజారిటీ
  • ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీల సొంతూళ్లలోనూ ఇదే పరిస్థితి
  • దళితబంధును పైలట్ ప్రాజెక్ట్​గా అమలు చేసిన తిరుమలగిరిలోనూ కాంగ్రెస్ కే ఆధిక్యం

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్​తుడుచుపెట్టుకుపోయింది. పల్లె ఓటర్లంతా కాంగ్రెస్ కే జై కొట్టారు. బీఆర్ఎస్​తాజా మాజీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లోనూ హస్తం గుర్తుకే అత్యధిక ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్​ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీల సొంతూళ్లలోనూ కాంగ్రెస్​పార్టీ హవానే నడిచింది. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి స్వగ్రామం నాగారం మొదలు 8 మంది మాజీ ఎమ్మెల్యేల గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే మెజారిటీ సాధించారు. దేవరకొండ, మునుగోడు, హుజూర్​నగర్ మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి సొంతూళ్లలో మాత్రమే బీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత వచ్చింది. కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, నల్గొండ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేల గ్రామాల్లో కాంగ్రెస్​పార్టీకి మంచి లీడ్ వచ్చింది. శాసనమండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి సొంతూరైన చిట్యాల మండలం ఉరుమడ్లలో కాంగ్రెస్ పార్టీ బంపర్​మెజార్టీ సాధించడం విశేషం.

ఆ ఒక్కచోట మినహా..

ఉమ్మడి జిల్లాలోని 12 సెగ్మెంట్లలో కాంగ్రెస్ 11 కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన 10 ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజార్టీ సాధించారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్నిచోట్లా కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లోనూ కాంగ్రెస్ పుంజుకోవడం ప్రభుత్వ వ్యతిరేకతను తేటతెల్లం చేస్తోంది. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీ, రూరల్ మండలంలో కాంగ్రెస్​ అభ్యర్థి మందుల సామేలుకు 5,552 ఓట్ల మెజారిటీ రావడం విశేషం. ఇక్కడ దాదాపు రెండు వేల మందికి పైగా దళితబంధు కింద లబ్ధి పొందారు. అయితే ఈ పథకం అమలులో అనేక అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే దళితబంధుతో లబ్ధిపొందినవారితోపాటు, పూర్తిస్థాయిలో అందనివారు సైతం కాంగ్రెస్​వైపు మొగ్గుచూపినట్టు స్పష్టమవుతోంది.

నాగారంలో కాంగ్రెస్ కు 631 ఓట్ల మెజార్టీ

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సొంతూరు నాగారం(తుంగతుర్తి సె గ్మెంట్)లో కాంగ్రెస్​ పార్టీకి 631 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్​కు1, 479 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్​కు 848 ఓట్లు పడ్డాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు స్వగ్రామం తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీకి 1,657 ఓట్ల మెజారిటీ వచ్చింది. నకిరేకల్​లో మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి గ్రామమైన ఉరుమడ్లలో కాంగ్రెస్​అభ్యర్థి నోముల వీరేశం 557 ఓట్ల మెజారిటీ సాధించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి సొంతూరు కూడా ఉరుమడ్లనే. ఈయనకు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఎప్పటి నుంచో వైరం నడుస్తోంది. దీంతో కంచర్ల వర్గం ఓటర్లు బీజేపీ వైపు మళ్లాయి. ఇక్కడ ఆ పార్టీకి ఏకంగా 300 ఓట్లు పోలయ్యాయి. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​స్వగ్రామమైన కేతేపల్లి మండలం బీమారంలో కాంగ్రెస్​పార్టీకి 436 ఓట్ల లీడ్ వచ్చింది. చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి బ్రదర్స్​సొంతూరైన నార్కట్ పల్లి మండలం బ్రహ్మణ వెల్లంలో వీరేశానికి 652 ఓట్ల మెజారిటీ వచ్చింది. జడ్పీ చైర్మన్​బండా నరేందర్​రెడ్డి గ్రామమైన నక్కలపల్లిలో కాంగ్రెస్​కు 351 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ మండలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్​రేగెట్ట మల్లికార్జునరెడ్డి గ్రామం చెర్వుగట్టులోనూ కాంగ్రెస్​కు 287 ఓట్ల లీడ్ వచ్చింది.

శాకాపురంలో 417 ఓట్ల లీడ్​

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్​రావు గ్రామమైన నిడమనూరు మండలం శాకాపురంలో కాంగ్రెస్​కు 417 ఓట్ల లీడ్ వచ్చింది. ఆగ్రోస్​ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి ఊరు సుబ్బారెడ్డిగూడెంలో కాంగ్రెస్​కు 295 ఓట్ల లీడ్ వచ్చింది. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్​ప్రాతినిధ్యం వహిస్తున్న 36వ వార్డు సుందర్​నగర్​లో కాంగ్రెస్​ పార్టీకి 426 ఓట్ల మెజారిటీ రాగా, నాగార్జునసాగర్​నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రామమైన బోయగూడెంలో కాంగ్రెస్ కు 216 ఓట్ల ఆధిక్యం దక్కింది. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్​గ్రామం నడిగూడెం మండలం కరివిరాలలో కాంగ్రెస్​కు 8 ఓట్లు, ఆలేరులో గొంగడి సునీత సొంతూరైన యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో కాంగ్రెస్ కు 69 ఓట్ల లీడ్ వచ్చింది. భువనగిరిలో ఫైళ్ల శేఖర్​రెడ్డి గ్రామం కదిరేనిగూడెంలో హస్తం పార్టీకి 78ఓట్లు, జడ్పీ చైర్మన్​ఎలిమినేటి సందీప్​రెడ్డి గ్రామం వడపర్తిలో 29 ఓట్ల లీడ్ వచ్చింది. సూర్యాపేట జిల్లా జడ్పీ చైర్మన్​గుజ్జ దీపిక ఊరైన తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో కాంగ్రెస్​కు 427 ఓట్ల మెజారిటీ రావడం విశేషం.

మూడు చోట్ల మాత్రమే బీఆర్ఎస్

దేవరకొండ, మునుగోడు, హుజూర్​నగర్​మాజీ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో మాత్రమే బీఆర్ఎస్​ఆధిక్యత కనబరిచింది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్​గ్రామమైన దేవరకొండ మండలం శేరిపల్లిలో బీఆర్ఎస్ కు 183 ఓట్ల లీడ్​రాగా, కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి సొంతూరైన నారాయణ్​పూర్​మండలం లింగావారిగూడెంలో 314 ఓట్ల లీడ్​వచ్చింది. హుజూర్​నగర్​లో శానంపూడి సైదిరెడ్డి స్వగ్రామం మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో 121 ఓట్ల లీడ్ వచ్చింది. మునుగోడులో మాజీ ఎమ్మె ల్సీ కర్నె ప్రభాకర్​గ్రామమైన సంస్థాన్​నారాయణ్​పూర్​లో కాంగ్రెస్ కు 1,252 ఓట్లు పోలయ్యాయి.

కింది స్థాయి లీడర్లనూ నమ్మలే

ఎంపీపీలు, జడ్పీటీసీల గ్రామాల్లో కాంగ్రెస్ గాలి వీచింది. జడ్పీ చైర్మన్లు ప్రాతినిధ్యం వహించే మండలాలతోసహా అన్ని చోట్ల కాంగ్రెస్ హవా కొనసాగింది. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మీద సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేయడంతో తిప్పర్తి మండలంలో కాంగ్రెస్​కు 7,900 ఓట్ల మెజారిటీ వచ్చింది. జడ్పీ ఫ్లోర్​ లీడర్ పాశం రాంరెడ్డి నేతృత్వంలో 10 మంది సర్పంచులు, డీసీసీబీ డైరక్టర్, ఎంపీపీతో సహా చాలా మంది నాయకులు ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లో చేరారు. రాంరెడ్డి సొంత ఊరైన మర్రిగూడలో భూపాల్​రెడ్డికి కేవలం 35 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 260 ఓట్లు పోలయ్యాయి. ఈ మండలంలో కాంగ్రెస్​కు 7,900 ఓట్ల మెజారిటీ రావడం రికార్డు. రాంరెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇదే మెజార్టీ వచ్చింది. భూపాల్​రెడ్డి మీదున్న కోపంతో ఆయన కాంగ్రెస్​గూటికి రావడంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇదే హవా నల్గొండ మున్సిపాలిటీలోనూ కొనసాగింది. 48 వార్డుల్లో కాంగ్రెస్​పార్టీకి లీడ్​వచ్చింది. దాదాపు 1,100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఎన్నికల ప్రచారంలోఅదేపనిగా ప్రచారం చేసినా ఓటర్లు కాంగ్రెస్​వైపే మొగ్గు చూపారు.