న్యూఢిల్లీ: పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన విందుకు లోకసభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇన్వేటిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మోదీ సర్కారు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నదని అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు.
పుతిన్ గౌరవార్థం జరుగుతున్న అధికారిక విందుకు లోక్‌సభ, రాజ్యసభల ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం రాలేదని స్పష్టం చేశారు. ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు అసలు ప్రొటోకాల్‌నే పాటించడం లేదని, ప్రజాస్వామ్య సూత్రాలను విశ్వసించడం లేదని కాంగ్రెస్మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా ఆరోపించారు. శశిథరూర్‌కు ఆహ్వానంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అది ఆయననే అడగండి. మా అధినేతలకు ఇన్విటేషన్‌కు రాకుండా మాకు వస్తే మేమైతే మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటాం. ఆ విందుకు వెళ్లం” అని సమాధానమిచ్చారు.
ప్రభుత్వ ఆహ్వానంతో డిన్నర్కు హాజరైన శశిథరూర్
రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం ఢిల్లీలోని రాష్ట్రపతి నివాసంలో శుక్రవారం నిర్వహించిన విందులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ, పుతిన్‌తో కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్‌కు రాజకీయ, వ్యాపార, సంస్కృతితో సహా 7 రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించగా.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాగా, గత ఆరు నెలలనుంచి కాంగ్రెస్‌తో శశిథరూర్ సంబంధాలు సంక్షోభంలోనే కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్, ఖర్గేను డిన్నర్‌కు ఆహ్వానించకుండా.. శశిథరూర్‌ను ఇన్వైట్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే, ఇది ఫారిన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడిగా తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని శశిథరూర్ మీడియాతో తెలిపారు. రాహుల్, ఖర్గేకు ఎందుకు ఆహ్వానం లభించలేదని విలేకరులు అడగ్గా.. ఇన్విటేషన్స్‌లో ఎలాంటి ప్రొటోకాల్ పాటించారో తనకు తెలియదన్నారు.
