- జిల్లా నేతలకు మహేశ్ గౌడ్, మీనాక్షి, ఉత్తమ్ దిశానిర్దేశం
- భేటీకి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ గైర్హాజరు
హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని, ఇందుకోసం స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆ జిల్లా నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దిశానిర్దేశంచేశారు. నిజామాబాద్ పార్లమెంటరీస్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని గురువారం గాంధీభవన్‌లో నిర్వహించారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు హాజరుకాగా, జగిత్యాల నుంచి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ గైర్హాజరయ్యారు. సర్వే ఆధారంగా గెలిచే అవకాశమున్నవారికే టికెట్లు ఇస్తామని, మిగిలినవారంతా సహకరించాలని నేతలు సూచించారు. రెబల్స్ బరిలో నిలవకుండా బుజ్జగించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలు, డీసీసీ చీఫ్, పార్టీ పట్టణ అధ్యక్షులు దృష్టిపెట్టాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, బీజేపీకి కొన్నిచోట్ల అనుకూల వాతావరణం ఉన్నందున ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నేతలు సూచించారు. కాగా, ఈ సమావేశంలో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ప్రత్యేక చర్చ జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఎవరికివారు తమ అనుచరులకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నందున ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేశారు.
