ఎంపీ అభ్యర్థులెవరు?..రాష్ట్రంలో కాంగ్రెస్ టార్గెట్ 15 సీట్లు

ఎంపీ అభ్యర్థులెవరు?..రాష్ట్రంలో  కాంగ్రెస్ టార్గెట్ 15 సీట్లు
  •     ఇక్కడి నుంచి సోనియాను పోటీ చేయించాలని నిర్ణయం
  •     సీఎం రేవంత్​ ప్రాతినిధ్య వహించిన మల్కాజ్​గిరిపై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. అదే జోష్​తో లోక్​సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది. 15 స్థానాల్లో గెలిచేలా టార్గెట్​నూ ఫిక్స్​ చేసుకుంది. ఈసారి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు, పార్టీకి అభ్యర్థుల విషయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ తెలంగాణలోని లోక్​సభ స్థానాల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థులు రేసులో ఉండగా.. ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులున్నాయి. సిట్టింగ్​ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి సీఎం, మంత్రుల హోదాల్లో ఉండడంతో వారి స్థానాల్లో ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

దక్షిణ తెలంగాణలో పోటీ ఎక్కువే

దక్షిణ తెలంగాణలోని లోక్​సభ సెగ్మెంట్లలో పోటీ కొంచెం ఎక్కువగానే ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్​ గెలిచిన రెండు నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్​ ఎంపీలు ఇప్పుడు మంత్రి వర్గంలో ఉన్నారు. నల్గొండ నుంచి గెలిచిన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. హుజూర్​నగర్​ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ స్థానంలో సూర్యాపేట అసెంబ్లీ టికెట్​ ఆశించి భంగపడిన పటేల్​ రమేశ్​ రెడ్డికి ఇప్పించేందుకు ఉత్తమ్​ సిఫార్సు కూడా చేశారు. అదే స్థానం నుంచి జానా రెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్​ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తున్నది. భువనగిరి నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి.. నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు. ఆ స్థానం నుంచి పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి భార్య లక్ష్మి పోటీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. చేవెళ్ల స్థానాన్ని తనకు లేదా తన భర్త నర్సింహా రెడ్డికి కేటాయించాలంటూ బడంగ్​పేట్​ మేయర్​ పారిజాత రెడ్డి కోరుతున్నారు. మహేశ్వరం టికెట్​ ఆశించినా చివరి నిమిషంలో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన కూడా చేవెళ్ల ఎంపీ టికెట్​ను ఆశిస్తున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఖమ్మంలో గతంలో రేణుకా చౌదరి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సోదరుడు ప్రసాద్​ రెడ్డి టికెట్​ఆశిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అక్కడ రేణుకా చౌదరి గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

ఈ స్థానాల్లో అయోమయం..

మెదక్​ నుంచి విజయశాంతిని బరిలోకి దించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే తొలి ఆప్షన్​గా ఆమె మెదక్​నే ఎంచుకునే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే విజయశాంతిని కరీంనగర్​ లేదా నిజామాబాద్​ నుంచి బరిలోకి దింపే అవకాశాలూ ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే, నిజామాబాద్​ నుంచి ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి బరిలో నిలిచే చాన్స్​ ఉందని  ఓ సీనియర్​ నేత చెప్పడంతో.. మెదక్​ లేదా కరీంనగర్ నుంచి విజయశాంతికి టికెట్​ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మహబూబ్​నగర్​ నుంచి గతంలో పోటీ చేసిన వంశీచందర్​ రెడ్డికే అవకాశం దక్కే సూచనలున్నాయి. ఇటు నాగర్​కర్నూల్​లో తనకు ఎంపీ టికెట్​లేదా పీసీసీ చీఫ్, లేదా ఎమ్మెల్సీ/మంత్రి పదవి ఇవ్వాలని సంపత్​ కుమార్​ హైకమాండ్​ను ఆయన కోరినట్టుగా తెలుస్తున్నది. ఒకవేళ ఆయనకు ఎంపీగా అవకాశమిస్తే.. అదే స్థానం నుంచి గతంలో పోటీ చేసిన మల్లు రవి నుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది.     

ఆదిలాబాద్​లో అభ్యర్థి కరువు..

ఆదిలాబాద్​లో ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. ఇప్పుడు ఆ సీటును ఎవరికిస్తారన్నదానిపై చర్చ జరుగుతున్నది. పెద్దపల్లి నుంచి గతంలో పోటీచేసిన ఎ. చంద్రశేఖర్​ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆ స్థానం నుంచి వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీకృష్ణ పోటీలో ఉన్నట్టుగా చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో జహీరాబాద్​ నుం చి పోటీచేసిన మదన్​మోహన్​ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్థానం నుంచి సురేశ్​ షెట్కార్​ బరిలో నిలిచే చాన్స్​ ఉంది. మహబూబాబాద్​ నుంచి ​గతంలో పోటీ చేసిన బలరాం నాయక్​.. మళ్లీ రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే, తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన హైకమాండ్​ మహబూబాబాద్​ ఎంపీ టికెట్​ఇస్తామని హామీ ఇచ్చిందంటూ బెల్లయ్య నాయక్​ చెప్తున్నారు. సికింద్రాబాద్​ నుంచి గతంలో పోటీ చేసిన అంజన్​ కుమార్​యాదవ్​కే ఇస్తారా.. లేదా ఆయన కొడుడు అనిల్​ కుమార్​ యాదవ్​కు ఇస్తారా అన్న చర్చ జరుగుతున్నది. వరంగల్​ నుంచి దొమ్మాటి సాంబయ్య గతంలో పోటీ చేయగా.. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ పరిశీలించే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది. 

సోనియా పోటీ చేస్తే గెలుపుపై ప్రభావం

ఈసారి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పార్టీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్,​ నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఒకవేళ ఆమెకు ఇష్టం లేకుంటే ప్రియాంక గాంధీతోనైనా పోటీ చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతలు ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన ఆమెనే నేరుగా మన రాష్ట్రంలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పార్టీ గెలుపును ప్రభావితం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం

 మల్కాజ్​గిరి సీటుపై ఆసక్తి?

సీఎం రేవంత్​ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే, పార్టీ వర్గాలు మాత్రం ఆయన ఫ్యామిలీలో ఇప్పటికే ఇద్దరికి టికెట్లు ఇచ్చారని, ఎమ్మెల్యేగా మైనంపల్లి ఓడిపోయారని అంటున్నాయి. ఆయన స్థానంలో వేరే నేతకు కేటాయించాలని అంటున్నారు.