రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తరు?: ప్రియాంక గాంధీ

రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తరు?: ప్రియాంక గాంధీ
  • ప్రమాణాలనేవి పాటించుడే ఉండదా?
  • ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలపై ప్రియాంకా గాంధీ మండిపాటు
  • రాహుల్​ను రావణుడంటూ పోస్టర్​ రిలీజ్ చేసిన బీజేపీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ రాహుల్​గాంధీ రావణుడంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్​పై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ శుక్రవారం ఫైర్ అయ్యారు. ‘‘మీరు రాజకీయాలను ఏ స్థాయికి దిగజార్చాలని అనుకుంటున్నారు? ఇంత హింసాత్మకంగా, రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి ట్వీట్లను మీరు సమర్థిస్తున్నారా? బాధ్యతతో, నిజాయితీగల రాజకీయాలు చేస్తామంటూ పదవులు చేపట్టేముందు మీరు చేసిన ప్రమాణాలను కూడా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లాగే మర్చిపోతున్నారా?”అంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఉద్దేశించి ప్రియాంక గాంధీ ట్విట్టర్​లో ప్రశ్నించారు.

పది తలల రావణుడిని తలపించేలా గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ ఫొటోను గ్రాఫిక్ చేసి బీజేపీ తన అఫీషియల్ ట్విట్టర్​ ఎకౌంట్​లో గురువారం పోస్ట్ చేసింది. ‘‘ఇతను దుర్మార్గుడు, ధర్మానికి, శ్రీరాముడికి వ్యతిరేకి, భారత్​ను నాశనం చేయడమే ఇతని టార్గెట్’’ అని ఆ పోస్టర్​కు క్యాప్షన్ పెట్టింది. దీనిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​కూడా తప్పుపట్టారు. రాహుల్​ను రావణుడితో పోలుస్తూ బీజేపీ చేసిన సిగ్గుమాలిన పనికి.. ఉన్న తిట్లన్నీకూడా సరిపోవని ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీవి నీచపు ఉద్దేశాలని ఆరోపించారు.

జమ్మూలో నిరసన ర్యాలీ రాహుల్ గాంధీ పోస్టర్‌‌‌‌పై బీజేపీకి వ్యతిరేకంగా జమ్మూకాశ్మీర్​ కాంగ్రెస్ శుక్రవారం నిరసన చేపట్టింది. మాజీ మంత్రి యోగేశ్ సాహ్ని నేతృత్వంలో జమ్మూలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి, దిష్టిబొమ్మలను దహనం చేశారు.