- సజ్జనార్.. కాంగ్రెస్ కండువా కప్పుకోండి : హరీశ్‌రావు
జహీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు యూరియా కూడా అందడం లేదని మండిపడ్డారు. ట్రాఫిక్ చలాన్లను ప్రజల అకౌంట్ల నుంచి డైరెక్ట్ డెబిట్ చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డికి.. సైబర్ నేరగాళ్లకు తేడా లేదన్నారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియాను సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, జర్నలిస్టులను పండుగ పూట అరెస్ట్ చేసి వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులేమైనా తీవ్రవాదులా ? సంఘ విద్రోహ శక్తులా ? వారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించారు. గతంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రి అడ్డగోలు కామెంట్స్ చేసినప్పుడు కూడా బాధపడింది ఓ మహిళేనని.. అప్పుడు పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెడితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సమావేశంలో జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.
