రిటైర్డ్ ఆఫీసర్లు ..ఇంకెందరున్నరు?

రిటైర్డ్ ఆఫీసర్లు ..ఇంకెందరున్నరు?
  • వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం 
     
  • అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ సంస్థలకూ ఆదేశం
  • ఇయ్యాల సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులర్

హైదరాబాద్, వెలుగు : రిటైర్​​ అయిన తర్వాత కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం​ దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఆఫీసర్లను ఇంటికి పంపగా, ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఫోకస్​ పెట్టింది. ఇందులో భాగంగా.. వివిధ శాఖల్లో పని చేస్తున్న రిటైర్డ్​ ఉద్యోగులందరి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్ మెంట్/ఎక్స్ టెన్షన్ తో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు పంపించాలని సీఎస్​ శాంతికుమారి అన్ని డిపార్ట్​మెంట్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. 

కేవలం ప్రభుత్వ శాఖలే కాకుండా వివిధ కార్పొరేషన్లు, బోర్డులు, సర్కార్ సంస్థల్లో పని చేస్తున్న రిటైర్డ్​ ఉద్యోగులందరి వివరాలు కూడా పంపించాలని అందులో పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిర్దిష్ట ఫార్మాట్ కూడా సర్క్యులర్ కు జత చేశారు. ఉద్యోగి పేరు? ఆ ఉద్యోగి ఎప్పుడు రిటైర్ అయ్యారు? రిటైర్ అయ్యే నాటికి ఉన్న హోదా ఏమిటి? ఇప్పుడు ఏ శాఖలో ఏ హోదాలో కొనసాగుతున్నారు?  రీఅపాయింట్ మెంట్ ఎప్పుడు జరిగింది? ఎంతకాలం కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చారు? తదితర వివరాలు పంపాలని స్పెషల్​సీఎస్​లు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్​ఓడీలను ఆదేశించారు. 

కాగా, చాలా డిపార్ట్ మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు కొనసాగుతున్నారని ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటోళ్లందరినీ తొలగిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మందిని తొలగించింది. ఇప్పుడు మిగిలినోళ్లపైనా ఫోకస్ పెట్టింది. త్వరలోనే వీళ్లందరినీ తొలగించనున్నట్టు చర్చ జరుగుతోంది.  

ఇంజనీర్లే ఎక్కువ మంది.. 

పంచాయతీరాజ్, రూరల్ డెవలప్​మెంట్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఇరిగేషన్​శాఖలో ఎక్కువ మంది రిటైర్డ్​ఉద్యోగులు కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో వివిధ హోదాల్లో రీఅపాయింట్ అయిన వీళ్లంతా.. ఇప్పుడు ప్రభుత్వం మారినా రాజీనామా చేయడం లేదు. ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ మురళీధర్ సహా పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు ఏండ్లకేండ్లుగా రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. మురళీధర్ ఉమ్మడి రాష్ట్రంలోనే రిటైర్డ్ కాగా అప్పటి నుంచి ఎక్స్ టెన్షన్ పై కొనసాగుతున్నారు. 2013 జులై ఒకటో తేదీ నుంచి మురళీధర్ ఎక్స్ టెన్షన్ లో రెగ్యులర్ ఈఎన్సీగా ఉన్నారు. ఆయన తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈఎన్సీగా కొనసాగుతారని రెండున్నరేండ్ల కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 

ఇక ఈఎన్సీ హోదాలో వెంకటేశ్వర్లు (రామగుండం) కూడా ఎక్స్ టెన్షన్ పై కొనసాగుతున్నారు. నాగర్ కర్నూల్ సీఈ హమీద్ ఖాన్, ఎస్ఈలు సుధాకర్ రెడ్డి(వరంగల్), టి.వేణు (గజ్వేల్), రాం శ్రీనివాస రావు (క్వాలిటీ కంట్రోల్, హైదరాబాద్), కోటేశ్వర్ రావు (ఇంటర్ స్టేట్), ఈఈ గోపాల్ రెడ్డి (నల్గొండ) రిటైర్ అయినా రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నారు. రిటైర్డ్ ఈఎన్సీ విజయ ప్రకాశ్ అడ్వైజర్ గా, పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్ గా, రిటైర్డ్ ఈఈ మల్లయ్య గజ్వేల్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ గా, రిటైర్డ్ ఈఈ మహబూబ్ హుస్సేన్ ఇంటర్ స్టేట్ విభాగం కన్సల్టెంట్ గా, రిటైర్డ్ ఈఈ శ్రీనివాసులు ఓఅండ్ ఎం కన్సల్టెంట్ గా కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేస్తున్నారు. వీరే కాకుండా పలువురు ఫీల్డ్ ఇంజనీర్లు (ఏఈఈలు, ఏఈలు) ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు.