ప్రజాపాలన విజయోత్సవ సంబురం..ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో

ప్రజాపాలన విజయోత్సవ సంబురం..ట్యాంక్ బండ్ దగ్గర ఎయిర్ షో
  • ప్రజాపాలన విజయోత్సవ సంబురం
  • నెక్లెస్ రోడ్​లో ఫుడ్ స్టాళ్లు ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్​
  • ప్యారడైజ్, నిలోఫర్ ​కేఫ్, గోకుల్​చాట్​ తదితర 100 స్టాల్స్ ఏర్పాటు
  • ఇయ్యాల సాయంత్రం ట్యాంక్​బండ్ దగ్గర ఎయిర్​షో
  • 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, డ్రోన్​ షో

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. శనివారం సాయంత్రం హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.  ఈ నెల 7, 8, 9న మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాదీ బిర్యానీ, చాట్, ఐస్ క్రీం, బేకరీ, నార్తన్ తదితర పసందైన వంటకాలతో కూడిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. విజయోత్సవాల్లో పాల్గోనే సందర్శకుల కోసం మొగలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరి ఐటమ్స్, ఐస్ క్రీం పార్లర్లతో కూడిన వందకు పైగా ఫుడ్ స్టాళ్లు అందుబాటులోకి తెచ్చారు.

 అంతర్జాతీయంగా పేరొందిన హైదరాబాదీ దమ్ బిర్యానీ తోపాటు మొగలాయి జఫ్రానీ బిర్యానీ పర్యాటకులకు అందించేందుకు ప్యారెడైజ్, పిస్తా హౌజ్, షాదాబ్, బడేమియా కబాబ్ తదితర ప్రముఖ హోటళ్లు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. వీటితోపాటు తెలంగాణ వంటకాలుగా పేరొందిన పాలమూరు గ్రీల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటు కోడి కూర, ఫుడ్ జెయింట్స్ ను అందుబాటులోకి తెచ్చారు. నిలోఫర్ కేఫ్, బ్రౌన్ బేర్ బేకరి, మ్యాగి హాట్​స్పాట్, కాంటినెంటల్ కాఫీ, ప్రాంకి అండ్ రోల్స్, మొమోస్ అండ్ ఫ్రైస్, గోకుల్ చాట్ , ఆగ్రా చాట్ అండ్ స్వీట్స్ తమ ఫుడ్ స్టాళ్ల ను ఏర్పాటు చేశారు. 

ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను కూడా పెట్టారు. ఓపెనింగ్​కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, సీఎస్ శాంతి కుమారి, జీహెచ్‌‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, జీఏడీ కార్యదర్శి రఘునందన్, జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు. 9న(సోమవారం) సచివాలయ ప్రాంగణంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం, డ్రోన్ షో కూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఎయిర్​షోపై సీఎస్​ రివ్యూ

ఎయిర్ షో ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి శనివారం అధికారులతో సమీక్షించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షో లో సూర్యకిరణ్ కు చెందిన తొమ్మిది విమానాలు పాల్గొంటాయని తెలిపారు. సీఎం, మంత్రులు, వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన అధికారులు ఎయిర్ షో చూసేందుకు హాజరవుతున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ షో అనంతరం ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు.