ఓటీఎస్ కు నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు  

ఓటీఎస్ కు  నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు  
  • అవగాహన కల్పించడంలో బల్దియా విఫలం
  • 2 నెలల్లో కలెక్ట్​ చేసింది రూ.155 కోట్లే  
  •  ఏటా ఒక్క నెలలోనే రూ.500 కోట్లు వసూలు
  • 3 కార్పొరేషన్లలో మొత్తం బకాయిలు రూ. 11 వేల కోట్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆస్తి పన్ను బకాయిల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్​టైమ్ సెటిల్​మెంట్ (ఓటీఎస్) కు స్పందన కరువైంది. గతేడాది డిసెంబర్ 4 నుంచి అమల్లో ఉన్నా ఆశించిన స్పందన రావడంలేదు. గతంతో పోలిస్తే  ఈసారి ఆదాయం చాలావరకు తగ్గింది. మరో 20 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మూడునెలలపాటు ఓటీఎస్​అందుబాటులో ఉంచారు. ఓటీఎస్​ద్వారా ఈ ఫైనాన్షియల్​ఇయర్​కు రూ.500 కోట్లు వస్తుందని అధికారులు టార్గెట్ పెట్టుకున్నా ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో కలెక్ట్​ చేసింది కేవలం రూ.155 కోట్లు మాత్రమే. గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అనౌన్స్​మెంట్​ద్వారా,  ప్రభుత్వ ఆఫీసుల్లో బోర్డులు ఏర్పాటు చేసి, వాల్ పోస్టర్లు అతికించి, బస్ స్టాప్ లలో ఫ్లెక్సీలు పెట్టి, బ్యాంకులు, టీవీలు, రేడియో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చి, పాంప్లెట్స్​ద్వారా అవగాహన కల్పించేవారు. కానీ, ఈ సారి లైట్​తీసుకోవడంతో ప్రజల్లో అవగాహన లేక ఆదాయంపై ప్రభావం పడింది.  

రూ.11 వేల కోట్ల బకాయిలు

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్ల బకాయిలు రూ.11 వేల కోట్ల వరకు ఉంది. ఇందులో సగం వరకు ప్రభుత్వ ఆస్తులకి సంబంధించినవి ఉండగా, మిగతావి ప్రైవేట్ ఆస్తులు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్ష్యం రూ.3వేల కోట్లు పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.2,060 కోట్లు వచ్చింది. ఇందులో రూ.155 కోట్లు ఓటీఎస్​ ద్వారా వచ్చింది.  భారీగా  బకాయిలు పేరుకుపోయినా వసూళ్లు మాత్రం కావడంలేదు.   

నాలుగోసారి అమలు...

గ్రేటర్ లో ఇప్పటికే మూడు సార్లు ఓటీఎస్ అమలు చేశారు.  కరోనా టైంలో బల్దియా ఆదాయం తగ్గడంతో ఓటీఎస్​ తీసుకొచ్చారు. ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు ఓటీఎస్ ద్వారా రూ.400 కోట్లు వచ్చింది. 2022–23 జులైలో రెండోసారి అమలు చేయగా రూ.170 కోట్లు వచ్చింది.  2024–25 మార్చిలో రూ.350 కోట్లు వచ్చింది. ఇదంతా పాత జీహెచ్ఎంసీ వరకు మాత్రమే. కానీ ఈ ఆర్థిక సంవత్సరానికి మూడు కార్పొరేషన్లకి సంబంధించి రూ.500 కోట్ల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నా పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడంలేదు.