ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు!

ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు!

హైదరాబాద్, వెలుగు: ధరణిలో జరిగిన అక్రమాల చిట్టాను బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే విచారణ కోసం కమిటీని నియమించిన ప్రభుత్వం.. ఆ కమిటీ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకుంటున్నది. లోక్​సభ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్​, భూ అక్రమాలపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలని భావిస్తున్నది. 

గత బీఆర్​ఎస్​ సర్కార్​లో మంత్రులుగా పనిచేసిన కొందరు ధరణిలో భారీగా అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మాజీ సీఎం కేసీఆర్​ కుటుంబసభ్యుల్లోని ఆరుగురు కూడా భూములను కొల్లగొట్టినట్టు రిపోర్టులు అందాయి. ఆ వివరాలన్నింటినీ ఆధారాలతో పాటు జనం ముందు పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది.

కమిటీ విచారణలో అనేక అక్రమాలు బయటికి

ధరణి అక్రమాలను తేల్చేందుకు కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని వివరాలను తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. నిషేధిత జాబితాలో ఉన్న 23 ఎకరాల భూమి బీఆర్​ఎస్​ ఎంపీ సంతోష్​  సంబంధీకులకు పట్టాగా మారిందని ధరణి కమిటీలోని సభ్యుడు కోదండరెడ్డి ఇటీవల బయటపెట్టారు. ఆ ఒక్కటే కాదని.. అలా ముఖ్యమైన బీఆర్​ఎస్​ లీడర్లు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరు కూడా ధరణిలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి  అన్నారు. ఏయే భూములు ఎక్కడెక్కడ, ఎవరెవరూ, ఎలా వాళ్ల వాళ్ల పేర్ల మీదికి మార్చుకున్నారనే దానిపై పూర్తి వివరాలతో జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ, వక్ఫ్​, దేవాదాయ, అసైన్డ్​ భూములను బీఆర్​ఎస్​ లీడర్లు వాళ్ల హయాంలో తమ పేర్ల మీదికి ఎలా మార్చుకున్నారనే దానిపై ఇప్పటికే ధరణి కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని వెరిఫై చేసుకోవడంతో పాటు అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం తెప్పించుకుంటున్నది. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నలుగురు లీడర్లు ధరణిలో భూములను కొల్లగొట్టినట్లు ప్రస్తుత సర్కార్​ దృష్టికి వచ్చింది. మాజీ సీఎం కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కూడా ధరణిలో అక్రమంగా భూములు కాజేశారనిప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.  

జనాలే డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇస్తున్నరు

ధరణి పోర్టల్​తో భూముల గోల్​మాల్​ జరిగిందన్న ఆరోపణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్​ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డికి జనం నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్ గిరి , సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్​నగర్​, కరీంనగర్​, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, వరంగల్​, హన్మకొండ జిల్లాల్లోని అక్రమ భూ బదలాయింపులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.  ఎవరెవరు, ఎలా భూములు మార్చుకున్నారు? అంతకుముందు ఆ భూమి క్లాసిఫికేషన్​ ఏమిటి ? తప్పుడు పత్రాలు ఏం సృష్టించారు ? కబ్జాలో ఎవరుంటే.. పట్టాలు ఎవరికి వచ్చాయి ? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా జనం అందజేశారు. 

2014 కంటే ముందు, ఆ తర్వాత భూ వివరాలపై ఫోరెన్సిక్​ ఆడిట్

ధరణిలోని అక్రమాలను మరింత సులువుగా గుర్తించేందుకు ఫోరెన్సిక్​ ఆడిట్​ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 2014 కంటే ముందు ప్రభుత్వ, వక్ఫ్​, దేవాదాయ, భూదాన్​, అసైన్డ్​ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ? ఎవరెవరి పేరు మీద ఉన్నాయి?.. అనే డేటాను తీస్తున్నది. దాన్ని ఆధారంగా చేసుకుని 2014 తరువాత ఏయే భూములు ఎవరెవరికి మారాయి ? ఏ రకంగా ఇచ్చారు ? 2020లో ధరణి పోర్టల్​ వచ్చాక ఎలా మారాయి? ప్రొసీడింగ్స్  ఏమైనా ఇచ్చారా ? ఇస్తే.. దేని ఆధారంగా  ఇచ్చారు? అని పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్​ ఆడిట్​ చేయనున్నారు. మండలాలు, జిల్లాల వారీగా ఈ కసరత్తును చేపట్టనున్నారు. దీంతో ఫీల్డ్​ లెవెల్​ నుంచే అసలు విషయం  బయటపడుతుందని అధికారులు అంటున్నారు