ఉద్యోగులు, కార్మికుల..సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగులు, కార్మికుల..సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్  ప్రభుత్వంపై గంపెడాశతో  రాష్ట్ర ఉద్యోగ,- కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి. గత  ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించకుండా పెండింగులో పెట్టింది.  వారి సమస్యలను చెప్పుకుందామన్నా కేసీఆర్​తన హయాంలో సమయం ఇవ్వలేదు. బీఆర్ఎస్​కు అనుకూల సంఘాల నాయకులను ప్రగతి భవన్​కు పిలుచుకొని వారు చెప్పినవారికి ప్రమోషన్స్, బదిలీలు ఇస్తుండేవారు. కానీ,  ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించకుండా దాటవేస్తుండేవారు. సంఘనాయకులు కూడా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేవారు కాదు. నూతన ప్రభుత్వమైనా పెండింగ్​లో ఉన్న డీఏ బకాయిలు, పే రివిజన్​పై దృష్టి పెట్టాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుకుంటున్నారు.

నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సీఎం  రేవంతరెడ్డి  ప్రగతి భవన్  ప్రవేశానికి ఉన్న నిబంధనలను తొలగించారు. చుట్టూ ఉన్న ముండ్ల కంచెను తొలగించటంతో జైలు నుంచి బయటపడ్డ మాదిరిగా ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు తండోపతండాలుగా వస్తున్నారు.  స్వేచ్ఛగా ప్రజాభవన్ కు, రాష్ట్ర సచివాలయానికి వచ్చి వినతిపత్రాలను ఇచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖునే జీతాలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించిన హామీ మేరకు 3,69,300 మంది ఉద్యోగులకు జీతాలు, 2,88,000 మంది పెన్షన్ దారులకు పింఛన్ చెల్లించింది. గత బీఆర్ఎస్ పాలనలో సక్రమంగా జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీతాలు చెల్లింపుల్లో మార్పు వచ్చింది. దీనిపై  సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. 

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

వేల సంఖ్యలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు  ట్రెజరీల్లో ఆమోదం పొంది రెండేండ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్నవి. ముఖ్యంగా జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రియింబర్స్​మెంట్, పెన్షన్ తదితర బిల్లులన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం 3 డిఏలు ఇవ్వకుండా కాలయాపన చేసింది. 2022 జులైలో 3.64 శాతం, 2023 జనవరిలో 3.64 శాతం, జులైలో 3.64 శాతం, మూడు డీఏలు కలిపి 10.62 శాతం పెండింగులో ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో 3.64శాతం కలిపి 4 డిఏలు మొత్తం 14.56 శాతం రాష్ట్ర  ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్  మార్చి రెండో వారంలో ఎప్పుడైనా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈసీ  కసరత్తు  చేస్తున్నది. ఈలోపల  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

317 జీవో సవరణ చేయాలి 

గత ప్రభుత్వం అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా  తెచ్చిన 317 జీవో ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు రెండున్నర సంవత్సరాలుగా  అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి భవన్, సచివాలయం ముందు కుటుంబ సభ్యులతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టినప్పటికీ బాధిత ఉద్యోగులను పట్టించుకోలేదు. ఎన్నికల నేపథ్యంలో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.  ఇందులో భాగంగానే దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని శ్రీధర్ బాబు,  పొన్నం ప్రభాకర్  ముగ్గురితో వేసింది. వీరు పరిష్కారానికి కృషి చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుతామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హామీఇచ్చి కాలయాపన చేస్తూ  కాలం గడిపేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. పాత పెన్షన్​ అమలుకు కార్యాచరణ చేపట్టాలి.

పీఆర్సీ అమలు చేయాలి 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపు పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని రేవంత్​ సర్కారు హామీ ఇచ్చింది. కొత్త పీఆర్సీలో జీతభత్యాలు పెంచాలని, అనుకూలమైన ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు  రాష్ట్ర వేతన సంఘం చైర్మన్ శివశంకర్​కు విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారు.  ముఖ్యంగా కనీస వేతనం రూ. 35వేలు కోరారు.  వీటన్నిటినీ క్రోడీకరించి పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. ఆ తర్వాతే పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలలో  2.5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో  రెగ్యులర్ ఉద్యోగుల పనిని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ  అతి తక్కువ వేతనాలు పొందుతున్నారు.  వీరందరికీ  కనీస వేతన విధానాన్ని రూ.35 వేలుగా పీఆర్సీలో నిర్ణయించాలని కోరుతున్నారు. ఈ నెలలో  దాదాపు 30 వేల మందికి ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ సర్కారు.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల  భర్తీకి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని  ప్రకటించింది.  ఆ వైపు ప్రణాళికబద్ధంగా కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు  ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

-  ఉజ్జిని రత్నాకర్ రావు ఏఐటీయూసీ సీనియర్ నేత