
ఛండీఘర్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 10 ఏళ్లుగా పవర్లో ఉన్న బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ (సెప్టెంబర్ 18) మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో 7 ప్రధాన హామీలతో ఓటర్లకు వరాల జల్లు కురిపించింది.
300 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు 100 గజాల ప్లాట్లు.. ఇళ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షల ఆర్థిక సహయం, కుల గణన, కనీస మద్దతు ధరకు చట్టబద్దత వంటి హామీలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. కాగా, ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా, హర్యాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.
Also Read :- మధ్యాహ్న భోజనానికి ఉచితంగా కూరగాయలు
కాంగ్రెస్ మేనిఫెస్టోలని ప్రధాన హామీలు:
- కనీస మద్దతు ధరకు చట్టబద్దత
- ప్రకృతి విపత్తులు సంభవిస్తే తక్షణమే పంట నష్టపరిహారం.
- పేదలకు 100 గజాల ప్లాట్.. ఇంటి నిర్మాణానికి 3.5 లక్షలు సహయం
- వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు రుూ.6 వేల పెన్షన్
- పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ
- కుల గణన నిర్వహించడం.
- క్రీమీ లేయర్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
- 2 లక్షల ఖాళీ పోస్టులకు రిక్రూట్‌మెంట్
- డ్రగ్ ఫ్రీ హర్యానాకు చొరవ
- 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
- 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలకు రూ. 2000
- రూ.500లకే గ్యాస్ సిలిండర్