కేసీఆర్​కి పీకే ఒక్కడే.. మాకు లక్షల మంది ఏకే47లు

కేసీఆర్​కి  పీకే ఒక్కడే.. మాకు లక్షల మంది ఏకే47లు

హైదరాబాద్​, వెలుగు: కేసీఆర్​కు ఒక్క పీకే మాత్రమే ఉన్నాడని, కానీ కాంగ్రెస్​కు లక్షల మంది ఏకే 47లున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్త ఒక ఏకే 47 అని ఆయన అన్నారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఇందిరాభవన్​లో నిర్వహించిన డిజిటల్​మెంబర్​షిప్​ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కాంగ్రెస్​ పార్టీ డిజిటల్​ మెంబర్​షిప్​ తీసుకున్నారని, దేశంలోనే అది రికార్డ్​ అని చెప్పారు. నల్గొండలో అత్యధికంగా మెంబర్​షిప్​లు తీసుకున్నారన్నారు. మార్చి 31 దాకా డిజిటల్​ మెంబర్​షిప్​కు గడువు ఉందని, మరికొన్ని లక్షల సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. టీఆర్​ఎస్​ 62 లక్షల సభ్యత్వాలను చేసిందని, దాన్ని క్రాస్​ చేసేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు రేవంత్​ సూచించారు. పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుస్తుందన్న ధీమా పెరిగిందన్నారు. కాంగ్రెస్​ను పునాదుల నుంచి నిర్మించాల్సిన పరిస్థితులు 
వచ్చాయన్నారు. 

పనిచేసినోళ్లకే పదవులు
కేసీఆర్​ కొనుగోళ్ల రాజకీయాలతో ప్రజలు ఆలోచనలో పడ్డారని, వాళ్లకు కాంగ్రెస్​పై నమ్మకం కలిగేలా చేయాలని కేడర్​కు రేవంత్​ సూచించారు. డిజిటల్​ మెంబర్​ షిప్​తో కాంగ్రెస్​ నాయకుల సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మెంబర్​షిప్​ డ్రైవ్​లో కీలకంగా పనిచేసినోళ్లకు ఏఐసీసీ, పీసీసీల్లో పదవులిస్తామని హామీ ఇచ్చారు. పని చేయనోళ్లకు పదవులు రాకుండా తాను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. అవసరమైతే సోనియాగాంధీ, రాహుల్​ గాంధీకి చెప్తానని అన్నారు. అన్ని బూత్​లలో 100 సభ్యత్వాలు అయితేనే పీసీసీ బ్లాక్​ మెంబర్​ అవుతారని స్పష్టం చేశారు. పది రోజుల్లో టార్గెట్​ను అందుకోవాలని చెప్పారు. సభ్యత్వంపై బాగా పనిచేసినోళ్లమీద సోనియాకు నివేదిక ఇస్తానన్నారు. ఏఐసీసీ అభిప్రాయ సేకరణలో ముందున్నోళ్లకే ఎమ్మెల్యే అభ్యర్థిగా చాన్స్​ ఇస్తామన్నారు. టికెట్ల కేటాయింపుపై ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్​ ఆశించేటోళ్లంతా జాగ్రత్తగా పని చేయాలని సూచించారు.