నల్గొండ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ​ఫోకస్​

నల్గొండ గ్రాడ్యుయేట్స్​ ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ​ఫోకస్​
  • ఎన్నికలను సీరియస్​గా తీసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు
  • ముమ్మరంగా ఎన్నికల ప్రచారం 
  • 2021 లో మల్లన్నకు వచ్చిన ఓట్లు 83,290
  • నాడు 27 వేల ఓట్ల వద్దే కాంగ్రెస్​కు బ్రేక్ 
  • ఇద్దరి కలయికతో విజయంపై ధీమాతో ముందుకు

నల్గొండ, వెలుగు : నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్​స్థానంపై కాంగ్రెస్​ ఫోకస్ పెట్టింది. ఈ స్థానానికి నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్​ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. బీఆర్ఎస్​ అభ్యర్థులే నాలుగుసార్లు గెలిచారు. గత మూడు ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ మధ్య ట్రైయాంగిల్​వార్​ జరుగుతోంది. కాకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్​సర్కార్​ఉన్నందున ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చూస్తోంది. తెలంగాణ సెంటిమెంట్, బీఆర్ఎస్​మీదున్న నమ్మకంతో గ్రాడ్యుయేట్లు మూడు సార్లు పట్టం కట్టారు. 

ఓటర్ల విలక్షణ తీర్పు..

2021 ఎన్నికల్లోనే గ్రాడ్యుయేట్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్​అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఓటర్లు చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో ప్రొఫెసర్​కోదండరామ్, తీన్మార్​మల్లన్నతో సహా బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు పోటీ చేశాయి. సోషల్​మీడియా క్రేజ్​తో తీన్మార్​మల్లన్న బీఆర్ఎస్​కు గట్టిపోటీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్​కు కోదండరామ్, మల్లన్న చమటలు పట్టించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు బీఆర్ఎస్​కు1,10,840 పోలుకాగా, మల్లన్నకు 83,290 ఓట్లు పడ్డాయి. కోదండరామ్​కు 70,072 ఓట్లు పోలుకాగా, బీజేపీకి 39 వేలు, కాంగ్రెస్​కు 27,588 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తీన్మార్​ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు. 

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం..

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో మల్లన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈ మూడు జిల్లాల్లో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మంత్రులు ఉన్నారు. మొత్తం ఓటర్లు 4,63,838 మంది ఓటర్లు ఉన్నారు. 2021లో ఓటర్లు ఐదు లక్షల పైచిలుకు ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్​ పవర్​లో ఉన్నందున పట్టుబట్టి ఎమ్మెల్యేల క్యాంప్​ఆఫీసుల్లోనే ఓటరు నమోదు చేయించారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కుటుంబంలో గ్రాడ్యుయేషన్​ ​పూర్తిచేసిన వాళ్లను ఓటరుగా ఎన్​రోల్​చేయించారు. ఎంత చేసినప్పటికీ మేధావులు, విద్యావంతులు కోదండరామ్​పక్షాన నిలబడగా, యువకులు, నిరుద్యోగులు మల్లన్న వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు మల్లన్న కలయికతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 

గుజ్జల కష్టం ఫలించేనా..? 

గ్రాడ్యుయేట్​ఉప ఎన్నిక స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ నాయకత్వం అష్టకష్టాలు పడుతోంది. 2021లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన గుజ్జల ప్రేమేందర్​రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోబోతున్నారు. అప్పటి ఎన్నికల్లో బీజేపీకి కేవలం 39 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈసారి కొత్త ఓటర్లు, యువకులు, మోడీ చర్మిష్మాతో ముందుకుపోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో యువకులు, కొత్త ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారని, ఈ ఎన్నికల్లో కూడా వాళ్ల సపోర్ట్​తమకే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టేట్​పార్టీ చీఫ్​కిషన్​రెడ్డి, డీకే అరుణ, ఈటల రాజేందర్​తో సహా ఎంపీ అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.  

ప్రచారంపైనే ఫోకస్​..

నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్​కు తాజా, మాజీ లీడర్లు ఉన్నారు. కానీ బీజేపీలో బలమైన నాయకులు లేకపోవడంతో ఎన్నికల ప్రచారం నెమ్మదిగా సాగుతోంది.  సోషల్​మీడియా గ్రూపులు క్రియేట్ చేసి పార్టీ తరఫున ప్రచారం చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మోదీ స్లోగన్స్​, హిందుత్వవాదం, రిజర్వేషన్లు తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు తప్పిస్తే సీనియర్లు ఉప ఎన్నికలను సీరియస్​గా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.  

సీరియస్​గా తీసుకున్న మంత్రులు...

సోషల్​ మీడియాతో పబ్లిక్​లో క్రేజ్​సంపాదించిన తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కాంగ్రెస్​ మంత్రులు, సీనియర్లు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా గ్రాడ్యుయేట్లు, పార్టీ శ్రేణుల తో మీటింగ్​లు పెడుతున్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్​రెడ్డితో సహా మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి లాంటి వాళ్లు సైతం మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు.