లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోపై .. కాంగ్రెస్​ కసరత్తు

లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టోపై .. కాంగ్రెస్​ కసరత్తు
  • రాష్ట్ర మేనిఫెస్టో కమిటీతో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ
  • మేనిఫెస్టోలో పెట్టాల్సినఅంశాలపై చర్చ
  • విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్, వెలుగు :  లోక్​సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో తయారీపై కాంగ్రెస్​ హైకమాండ్​ కసరత్తు షురూ చేసింది. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను తీసుకుంటున్నది. అందులో భాగంగా మంగళవారం గాంధీభవన్​లో పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీతో సమావేశమైంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్​ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, కమిటీ ఇతర సభ్యులతో ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు, ఆలిండియా ప్రొఫెషనల్​ కమిటీ చైర్మన్​ ప్రవీణ్​ చక్రవర్తి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్​ మున్షీ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టోలోని హామీలు, ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని, దీంతో పార్టీకి ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్​ చక్రవర్తి అన్నట్టు తెలిసింది. అయితే, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన హామీలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించాల్సిందిగా మంత్రి శ్రీధర్​ బాబు సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో విద్యకు సంబంధించి మండలానికో ఇంటర్నేషనల్​ స్కూల్, జాబ్​ క్యాలెండర్​ను అమలు చేస్తామని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెట్టింది.

వైద్యానికి సంబంధించి ఆస్పత్రుల అప్​గ్రెడేషన్​తో పాటు ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల దాకా ఉచిత వైద్యం అందజేస్తున్నది. ఇలాంటి అంశాలను మేనిఫెస్టోలో చేరిస్తే బాగుంటుందని సూచించినట్టు తెలిసింది. ఇక, గిగ్​ వర్కర్లు, ఆటో డ్రైవర్ల సమస్యల వంటి వాటిని కూడా మేనిఫెస్టోలోకి తీసుకోవచ్చని సూచించినట్టు సమాచారం. అయితే, పార్టీ నేతలు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై ఏఐసీసీకి ఎప్పుడైనా సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని ప్రవీణ్​ చక్రవర్తి సూచించినట్టు తెలిసింది. 

రాష్ట్రంలో మంచి మేనిఫెస్టో తయారు చేశాం: శ్రీధర్​ బాబు

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మిగతా పార్టీల కన్నా మంచి మేనిఫెస్టోను అందించగలిగామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్​ పార్టీపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. ప్రతిపక్షాల విమర్శలు తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. 

పబ్లిక్​ ఫ్రెండ్లీగా మేనిఫెస్టో: ప్రవీణ్​ చక్రవర్తి

మేనిఫెస్టో అంటే పబ్లిక్​ ఫ్రెండ్లీగా ఉండాలిగానీ.. క్రోనీ క్యాపిటల్స్​కు మేలు చేసేదిగా ఉండకూడదని ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్​ చక్రవర్తి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో ఏఐసీసీ మేనిఫెస్టో రూపొందుతోందన్నారు. మేనిఫెస్టో తయారీకి తెలంగాణ కాంగ్రెస్​ నేతల సహకారం తీసుకుంటామన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి సలహాలు, సూచనలను తీసుకుంటున్నామన్నారు.

ప్రజాస్వామ్యంలో మేనిఫెస్టో అనేది ఒక ముఖ్యమైన సాధనమని, అందుకే ప్రజల నుంచే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలను తీసుకోవాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్​ గాంధీ రెండో విడత భారత్​ జోడో న్యాయ్​ యాత్రను తూర్పు నుంచి పడమరకు చేస్తున్నారని ప్రవీణ్​చక్రవర్తి చెప్పారు.