న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి హైకమాండ్ దిశా నిర్ధేశం చేసింది. సర్ జరుగుతున్న తీరు, ఓటర్లు, పార్టీ క్యాడర్లో అవగాహన కల్పించేలా మరింత ఫోకస్ పెంచాలని సూచించింది. అంతేకాకుండా అర్హులైన ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలంగాణ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని ఇందిరా భవన్లో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్య దర్శి సచిన్ సావంత్, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. సంఘటన్ సృజన్ అభియాన్, రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అంతర్గత అంశాలు, క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సర్ ప్రక్రి యపై సుదీర్ఘంగా చర్చించారు.
2025–26ను ‘సంస్థాగత సంస్కరణల ఏడాది’గా ఏఐసీసీ ప్రకటిస్తూ.. పార్టీ యంత్రాంగాన్ని బూత్ స్థాయి వరకు పటిష్టం చేసే దిశలో రూపొందించిన ఆరు ఎజెండా అంశాలపై రాష్ట్ర నాయకత్వం రిపోర్ట్ ను సమర్పించినట్టు తెలిసింది. ఈ రిపోర్ట్ లోని ఎజెండా అంశాల వారీగా.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కార్యక్రమాలు, బూత్, మండల, జిల్లా స్థాయిల్లో సంస్థాగత కమిటీల ఏర్పాటు, పార్టీ శ్రేణుల పనితీరు, అప్పగించిన బాధ్యతలు, కాంగ్రెస్ కనెక్ట్ యాప్ వినియోగం– నమోదు పురోగతి–పనితీరు పై అధిష్టానం అభినందించినట్టు తెలిసింది. అయితే, సర్ పై మాత్రం ఎలాంటి అలసత్వం ప్రదర్శించ కూడదని సూచించినట్టు సమాచారం.
బీఎల్ఏల పనితీరుపై అసంతృప్తి..
రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు సర్ ప్రక్రియపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. ప్రధానంగా.. క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్ఏ) పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధిష్టానం పలు సూచనలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నుంచి 35 వేల మంది బీఎల్ఏలను పార్టీ నియమించగా.. ఇందులో ప్రతి రోజు సుమారు మూడో వంతు(9 వేల మంది) మాత్రమే రిపోర్ట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మరో వారం రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో.. ఈ విధానం మార్చుకోవాలని సూచించినట్టు సమాచారం. అయితే, కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మాత్రమే పెద్ద సంఖ్యలో బీఎల్ఏలు గైర్హాజరవుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇంచార్జ్ లు, డీసీసీలకు దిశా నిర్దేశం చేయాలని సూచించినట్టు తెలిసింది. సంస్థాగతంగా పార్టీ తీసుకుంటున్న చర్యలను అభినందించిన అధిష్టానం.. సర్‌పై మాత్రం ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
ఈ దిశలో సర్ ప్రక్రియలో పార్టీ పాత్ర, బీఎల్ఏల హాజరు, ఇతర అంశాలపై బుధవారం పీసీసీ సమన్వయ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఇందిరా భవన్ లో ఈ కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీలో రాష్ట్ర ఇన్‌చార్జీ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్ తో పాటు మొత్తం 8 మంది ఉన్నారు. ఈ భేటీలో ప్రధానంగా సర్ తో పాటు, ఇతర రాజకీయ అంశాలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చ జరిగే అవకాశ ఉంది.
సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకూ చేరేలా పనిచేస్తున్నం: కేసీ వేణుగోపాల్
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకూ అందేలా ప్రభుత్వం, పార్టీ పూర్తి సమన్వ యంతో పనిచేస్తోందని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందించారు. ‘ఇందిరా భవన్ లో జరిగిన భేటీలో తెలంగాణకు సంబంధిం చిన సంస్థాగత విషయాలపై చర్చించాం.
ఈ మీటింగ్‌కు సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శు లు హాజరయ్యారు. 2023లో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి మా సంక్షేమ కార్యక్రమాలు చివరి మైలు వరకు చేరేలా ప్రభుత్వం, పార్టీ పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో మా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నం’ అని ట్వీట్ చేశారు.
పార్టీ పనితీరుపై అధిష్టానం సంతృప్తి: పీసీసీ చీఫ్
సంఘటన్ సృజన్ అభియాన్‌లోని అంశాలు, పార్టీ సంస్థాగత పనితీరులో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. పీసీసీ తీసుకుంటున్న చర్యలపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇందిరా భవన్లో మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని కార్యక్రమాలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమీక్ష చేశారన్నారు.
బూత్ స్థాయి నుంచి
పైస్థాయి వరకు సంస్థాగత నియామకాలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీల పనితీరుపైన సమీక్ష జరిగిందన్నారు. ఏఐసీసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను తెలంగాణలో బాగా చేశారని కేసీ అభినందినట్టు చెప్పారు. సర్‌పై మరింత లోతైన కార్యక్రమాలు చేయాలని చెప్పారన్నారు. ఈ విషయమై బుధవారం జరిగే పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తామన్నారు.
