నేడో, రేపో కాంగ్రెస్ సెకండ్​ లిస్ట్​ .. ఇయ్యాల సీడబ్ల్యూసీ, పార్టీ సీఈసీ మీటింగ్స్​

నేడో, రేపో కాంగ్రెస్ సెకండ్​ లిస్ట్​ .. ఇయ్యాల సీడబ్ల్యూసీ, పార్టీ సీఈసీ మీటింగ్స్​
  • ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్​రెడ్డి
  • రాష్ట్రంలో మిగిలిన 13 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చించే చాన్స్​
  • వంద రోజుల పాలనపై హైకమాండ్​కురిపోర్ట్​ ఇచ్చిన సీఎం రేవంత్​

న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో మిగిలిన 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ హైకమాండ్​ మంగళవారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఉదయం 10 గంటలకు అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశాలు జరుగనున్నాయి. 

ఈ రెండు సమావేశాలకు సీఎం రేవంత్​రెడ్డి హాజరుకానున్నారు.  సీఈసీ మీటింగ్​ తర్వాత మిగిలిన 13 ఎంపీ సీట్లలో అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నదని పార్టీవర్గాలు తెలిపాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడి నుంచి నేరుగా సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకొని, పార్టీ ఏఐసీసీ స్టేట్ ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో జరిగే  సీఈసీ మీటింగ్​కు  సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. అయితే ఈ అభ్యర్థుల లిస్ట్ మాత్రం ఒకటి, రెండు  రోజుల్లో విడుదల అయ్యే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. 

ప్రియాంక గాంధీతో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం జన్ పథ్ 10 లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ  భేటీలో తెలంగాణలో 100 రోజుల పాలనపై చర్చించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజా పాలన, గ్యారెంటీల అమలుతో ఆడబిడ్డల రెస్పాన్స్ ను తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్​ పాలనను ప్రియాంక గాంధీ అభినందించినట్టు సమాచారం.  

నేడు సీడబ్ల్యూసీ మీటింగ్ 

ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, సీడబ్ల్యూసీ మెంబర్లు ఇందులో పాల్గొంటారు. ఈ భేటీలో భాగంగా సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ అనే ఐదు న్యాయాల పేరుతో మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రతి విభాగంలో ఐదు గ్యారెంటీల పేరుతో మొత్తంగా 25 గ్యారెంటీలు చేర్చనున్నారు. 

రేవంత్​ను కలిసిన తాటికొండ రాజయ్య 

సీఎం రేవంత్ రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య కలిశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం తాను బస చేస్తున్న యమునా బ్లాక్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న రాజయ్య.. సీఎం ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం సీఎం తొమ్మిదో ఫ్లోర్ లోని తన రూంకు చేరుకోగా.. రాజయ్య కింది నుంచే వెనుదిరిగినట్టు సమాచారం. కాగా, ఆదిలాబాద్ నుంచి సీటు ఆశిస్తున్న కాంగ్రెస్ నేత డాక్టర్​ నరేశ్​ యాదవ్ సైతం సీఎం ను కలిసి, ఆ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.