
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నాయకులంతా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నెహ్రూ బీసీ రిజర్వేషన్లపై విముఖతతోనే అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారని గుర్తుచేశారు. కులగణన విషయంలో తెలంగాణ ‘మోడల్’ అని చెప్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడటం మొసలి కన్నీరే అని మండిపడ్డారు. జనాభా లెక్కలతో పాటు కులగణన చేయడం ప్రధాని మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ప్రధాని మోదీ ఫొటోకు ఆ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. ‘‘కుల గణన నిర్ణయం.. దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏండ్లలో ఒక్కసారి కూడా కులగణన చేపట్టలేదు. చివరిసారిగా 1931లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది. అప్పటి నుంచి కులగణనపై కాంగ్రెస్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంబేద్కర్ సిఫార్సు చేసిన కాకా కలేల్కర్ కమిషన్ ను పార్లమెంట్‌లో చర్చకు తీసుకురాకుండా కాంగ్రెస్ తిరస్కరించింది’’అని లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ ఎన్వీ సుభాశ్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.