భారత్ జోడో యాత్రతో ప్రధానిలో ఆందోళన మొదలైంది : కాంగ్రెస్

భారత్ జోడో యాత్రతో ప్రధానిలో ఆందోళన మొదలైంది : కాంగ్రెస్

వారణాసి : రాహుల్ గాంధీ వారణాసి పర్యటనను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని మండిపడింది. కేంద్ర పెద్దల ఒత్తిడి కారణంగానే ఎయిర్ పోర్టు అధికారులు ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతించలేదని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ ఆరోపించారు.  భారత్ జోడో యాత్ర చేసిన నాటి నుంచి ప్రధాని మోడీలో ఆందోళన మొదలైందని, అందుకే ఇప్పుడు రాహుల్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భయం కారణంగానే బీజేపీ ప్రభుత్వం రాహుల్ ఫ్లైట్ను అనుమతించకుండా అడ్డుకున్నారని  విమర్శించారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం రాత్రి వారణాసి చేరుకుని మంగళవారం ఉదయం శ్రీ కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారణాసి పర్యటన ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువుందన్న కారణంతో ఎయిర్ పోర్టు అధికారులు రాహుల్ ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతించలేదు. మరోవైపు ప్రెసిడెంట్ ముర్ము సోమవారం సాయంత్రం కాశీ విశ్వనాధున్ని దర్శించుకున్నారు. అనంతరం కోత్వాల్ బాబా కాల్ భైరవ్ టెంపుల్లో పూజలు చేశారు. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి వారణాసికి వచ్చిన ముర్ము దశ అశ్వమేథ్ ఘాట్ వద్ద గంగా హారతిలో పాల్గొన్నారు.