
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని కాంగ్రెస్ నేత ఈరవర్తి అనిల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు వీరికి సేవ్ కాంగ్రెస్ అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తనకు టికెట్ రావొద్దని ఆనాడు ఉత్తమ్ ప్రయత్నించారని.. కానీ ఈ విషయంలో భట్టి విక్రమార్క పట్టుబట్టి టికెట్ ఇప్పించారన్నారు. గూడూరు నారాయణ రెడ్డిని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డికి సుమారు రూ. 8 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉత్తమ్ పై పలు ఆరోపించారు.
రేవంత్ సర్కార్ పై పోరాటం చేయడం లేదా...
రేవంత్ రెడ్డి ఒక్క ఫోన్ లో అందుబాటులో ఉండడు.. అది తప్పా ఇంకేమైనా ఉందా అని ఈరవర్తి అనిల్ ప్రశ్నించారు. సర్కార్ పై పోరాటం చేయడం లేదా ? ప్రజా సమస్యలపై ఫైట్ చేయడం లేదా ? కాంగ్రెస్ సీనియర్ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. జనవరి 26 నుండి పాదయాత్రలు చేయనున్నారని వెల్లడించారు. దీనికి రేవంత్ లీడ్ చేయనున్నారని తెలిపారు.
కుల అహంకారం చూపించలేదా ?...
‘వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి ఉన్నప్పుడు.. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉండి ఆయన్ని చిన్న చూపు చూడలేదా ? కుల అహంకారం చూపించలేదా ? బీసీల టికెట్లు కోసే ప్రయత్నం ఉత్తమ్ చేయలేదా ? పొన్నాల టికెట్ కట్ చేసే ప్రయత్నం చేసిండు. కౌశిక్ రెడ్డికి టీఅరెస్ లో ఎమ్మెల్సీ వచ్చేలా చేసింది నువ్వు కాదా ? సీఎల్పీగా భట్టిని కాకుండా ట్రై చేయలేదా ? దళితున్ని సీఎల్పీ కాకుండా చేసే ప్రయత్నం చేయలేదా ? ఎల్బీ నగర్ టికెట్ కోసం ఓ వ్యక్తిని రూ. 5 కోట్లు అడగలేదా’ ? అని ఆరోపణలు చేశారు.
మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ?...
‘సునీల్ కనుగోలు పార్టీ కోసమే పనిచేస్తున్నాడు. పార్టీలోని వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఉత్తమ్ పై కూడా సునీల్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు...సీవీ ఆనంద్ మీకు ఎలా చెప్పారు ? మేముఎలా నమ్మాలి ? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని అన్నప్పుడు మీరెక్కడ వున్నారు ? బీజేపీకి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు ? మునుగోడులో లోపాయికారి ఒప్పందం చేసుకోలేదా ? దానికి సంబందించిన ఆధారాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
పదవులు మీకు, కేసులు క్యాడర్ కా ?
వార్ రూమ్ పై దాడి జరిగితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా పని చేశారని గుర్తు చేశారు. కార్యకర్తలపై 11 వేల కేసులున్నట్లు, పార్టీ కోసం, సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. మీ మీద ఎన్ని కేసులున్నాయి ? పదవులు మీకు, కేసులు క్యాడర్ కా..? అని నిలదీశారు. స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటారని, హుజూర్ నగర్ లో ఆ పార్టీ పొత్తు పెట్టుకొని ఓడిపోయారని విమర్శించారు. టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు వద్దా అన్నారు.