
హైదరాబాద్, వెలుగు: ఫార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, హరీశ్ రావుకు ఎక్కడిదని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిరాయింపులను మొదలు పెట్టిందే బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ కేబినెట్లో టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోలేదా...సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లింది నిజం కాదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ లో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కొని భట్టి విక్రమార్కను ప్రతిపక్ష నేత హోదా నుంచి దించేసింది కేసీఆర్ కాదా? అని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ..వారే స్వచ్ఛందంగా వస్తున్నారు తప్ప, తామెవరిని బతిమిలాడి తెచ్చుకోవడం లేదన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై జ్యూడీషియల్ కమిటీ వేస్తే, కమిటీనే కేసీఆర్ ప్రశ్నించడమేంటని ఫైర్ అయ్యారు.