మాపై కేసులు పెట్టాలని  ఈసీ చెప్పడం కరెక్ట్ కాదు : జగ్గారెడ్డి

మాపై కేసులు పెట్టాలని  ఈసీ చెప్పడం కరెక్ట్ కాదు : జగ్గారెడ్డి
  • సంగారెడ్డి గొడవపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: దొంగ ఓట్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఈసీ చెప్పడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి సంగారెడ్డి ఓటర్లుగా నమోదు చేయించారని బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.  “ దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను. గొడవ జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా? ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమయ్యారు.

దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై మాత్రం కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా?”అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపించారని,  అప్పుడు నమోదైన దొంగ ఓట్లు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వేస్తుంటే తాను అడ్డుకున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.