నియంత్రిత వ్యవసాయం కాదు… నియంతృత్వ వ్యవసాయ విధానం

నియంత్రిత వ్యవసాయం కాదు… నియంతృత్వ వ్యవసాయ విధానం

నియంత్రిత పంటల సాగు పేరుతో రాష్ట్ర‌ సర్కారు రైతుల స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ లీడ‌ర్ జీవ‌న్ రెడ్డి అన్నారు. గురువారం క‌రీంన‌గ‌ర్ లో నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ చెబుతున్న వ్య‌వ‌సాయం నియంత్రిత వ్యవసాయం కాదని, నియంతృత్వ వ్యవసాయ విధానమ‌ని అన్నారు.

సీఎం పత్తి సాగు పెంచాలని చెప్పడం చూస్తుంటే.. ఆయన పత్తి విత్తనాల కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్నట్లు ఉందని విమర్శించారు జీవన్ రెడ్డి. పత్తి ఏరడానికి కూలీలు ఎక్కువ సంఖ్యలో కావాలి. ఆ కూలీలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ? అని ప్ర‌శ్నించారు. రైస్ మిల్లర్ల నుంచి విముక్తి కల్పించేందుకు దొడ్డు రకం ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ సన్న రకాల పేరిట రైతులను మిల్లర్లకు తాకట్టు పెట్టే యత్నం చేస్తోందన్నారు. ప‌త్తి పంట రూపంలో జిన్నింగ్ మిల్లులకు, సన్నరకం ధాన్యం పేరుతో రైసు మిల్లర్లకు మేలు చేసే విధంగా సర్కారు తీరు ఉందని అన్నారు. సన్నరకాల ధాన్యానికి 25 వందల రూపాయల మద్ధతు ధర ప్రకటించాలని , మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడితే రైతులు నట్టేట మునగడం ఖాయమ‌ని చెప్పారు.

“కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని.. కరోనా లేకపోతే డ్యాన్స్ చేసేవాడినని రెండు నెలల క్రితం సీఎం చెప్పారు
కానీ వచ్చిన వరి దిగుబడి 60వేల మెట్రిక్ టన్నులే. వరికి మెడ విరుపు, అగ్గితెగులు సోకిందని సర్కారు చెబుతోంది. మరి వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్లు. దొడ్డు రకంలోనే చీడ పీడలను అరికట్టకపోతే ..సన్నరకంలో ఎలా అరికడతారా? సర్కార్ సమాధానం చెప్పాలి. రైతు బంధు.. విత్తనం పెట్టక ముందే ఇవ్వాలి , కానీ కొత్తగా రైతు పెట్టిన విత్తనాన్ని అధికారి ధృవీకరిస్తేనే ఇస్తామంటున్నారు. అలాంటప్పుడు రైతు బంధుఎలా ఉపయోగపడుతుందో ప్రభుత్వమే చెప్పాలి” అని జీవ‌న్ రెడ్డి అన్నారు.

congress leader jeevan reddy comments on agriculture policy at karimnagar press meet