
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక దోపిడీ విభాగంగా పనిచేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీకి విరాళాలిచ్చేలా 30 భారీ కంపెనీలపై దర్యాప్తు సంస్థలు ఒత్తిడి చేశాయని మీడియా పేర్కొందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గమనిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్నీ మోకాళ్ల మీద కూర్చోబెట్టి బీజేపీ నేతలు నిధులు సమకూర్చుకున్నట్లు అర్థమవుతోందన్నారు.
బీజేపీ, పలు కంపెనీల మధ్య సాగుతున్న క్విడ్ ప్రోకోపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశానని తెలిపారు. ఆ లేఖను ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు. 2018–19, 2022–23 లో ఆ కంపెనీల నుంచి బీజేపీకి రూ.335 కోట్లు విరాళంగా వచ్చాయన్నారు. అందులో ఆరు కంపెనీలు బీజేపీకి విరాళాలు ఇవ్వడం ఆపేశాక.. వాటిపై ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలు జరిగాయని గుర్తుచేశారు.