
- కాంగ్రెస్ నేత మధు యాష్కీ
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాష్ట్రంలో భద్రత కల్పించడంలో సీఎం కేసీఆర్ ఫెయిల్ అయ్యారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్లో, హైదరాబాద్ లో రాహుల్ యాత్ర సాగుతున్నప్పుడు రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్లు ఆపేశారని, కుట్రపూరితంగానే ఇలా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రాహుల్ యాత్రలో లైట్లు ఎందుకు పోయాయో చెప్పాలని బుధవారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు.
మహబూబ్ నగర్లో ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని రాహుల్ వద్దకు వచ్చాడని, మంగళవారం హైదరాబాద్లోని చార్మినార్ వద్ద సైతం పోలీసులు సరైన భద్రత కల్పించలేదన్నారు. పోలీసుల అత్యుత్సాహం, నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగిందని, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రావత్, ఇంకా చాలా మంది నాయకులు కింద పడ్డారన్నారు. రాహుల్ గాంధీకి ఇకనైనా సెక్యూరిటీ పెంచాలని కోరారు.