కేంద్రాన్ని ప్రశ్నించిన మల్లికార్జున్ ఖర్గే

కేంద్రాన్ని ప్రశ్నించిన మల్లికార్జున్ ఖర్గే
  • ఇలా కొనసాగితే ప్రజాస్వామ్యం బతికుంటుందా?
  • తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నరని ఆరోపణ
  • కాంగ్రెస్ నేతలు చట్టాన్ని ఎదుర్కోవాలన్న పీయూష్

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు తమకు ఎన్​ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు ఎట్లిస్తుందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. ఇది తమను బెదిరించే ప్రయత్నమని, కానీ తాము భయపడబోమని స్పష్టం చేశారు. ‘‘సభ నడుస్తున్నది. నేను ప్రతిపక్ష నేతను. కానీ ఇప్పుడు విచారణకు హాజరుకావాలని ఈడీ నాకు సమన్లు పంపింది. పార్లమెంటు కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈడీ సమన్లు ఇచ్చుడేంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులు షేమ్.. షేమ్.. అంటూ అరిచారు. ‘‘నేను చట్టానికి కట్టుబడి నడుచుకునే వ్యక్తిని. మధ్యాహ్నం 12.30కి నేను ఈడీ ఆఫీసుకు వెళ్లాలి. చట్టం నుంచి పారిపోవాలని అనుకోవట్లేదు. చట్టాన్ని అనుసరించాలని అనుకుంటున్నా” అని చెప్పారు. ‘‘ఇదిలానే కొనసాగితే.. మన ప్రజాస్వామ్యం బతికి ఉంటుందా? మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోగలమా? మమ్మల్ని నాశనం చేయడానికి, బెదిరించడానికి ఉద్దేశపూర్వకంగా ఇది జరుగుతున్నది. కానీ మేం బెదరము.. భయపడబోము.. పోరాడుతాం” అని చెప్పారు. తర్వాత ఈడీ విచారణకు ఖర్గే వెళ్లిపోయారు. దీనిపై రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. సెషన్ నడుస్తున్నప్పుడు ఈడీతో సమన్లు ఇప్పించి ‘మోడీ షాహీ’ మరింతగా దిగజారిపోయిందన్నారు. 

చట్టం నుంచి పారిపోవద్దు: గోయల్

ఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. లా ఎన్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏజెన్సీల విధి నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు చట్టాన్ని ఎదుర్కోవాలని, దాన్నుంచి పారిపోవద్దని, పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సజావుగా నడవనివ్వాలని కోరారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వారి పనిలో జోక్యం చేసుకున్నదని గోయల్ ఆరోపించారు. ‘‘ఖర్గే చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. చట్టం నుంచి పారిపోవడం మానుకుని.. చట్టాన్ని ఎదుర్కోవాలి” అని గోయల్ చెప్పారు. 

లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ పలుమార్లు వాయిదా

ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు చేసిన నిరసనలతో గురువారం రోజంతా లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, సీపీఐ తదితర పార్టీల ఎంపీలు వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపటికే సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. తిరిగి సెషన్ మొదలయ్యాక.. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్యే రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పన్నుల మార్పుకు సంబంధించిన రెండు చట్టబద్ధమైన తీర్మానాలను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టగా.. వాయిస్ ఓటు ద్వారా సభ ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు కొనసాగడంతో.. సభ్యులు కుర్చీల్లో కూర్చోవాలని, సభను సాగనివ్వాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీటులో ఉన్న కిరీట్ సోలంకి విజ్ఞప్తి చేశారు. అయితే సభ్యులు వినకపోవడంతో సభను రోజంతా వాయిదా వేశారు.

ఖర్గేను విచారించిన ఈడీ అధికారులు

కాంగ్రెస్​కు చెందిన నేషనల్​ హెరాల్డ్​ న్యూస్​ పేపర్​హోల్డింగ్​ కంపెనీ యంగ్​ ఇండియన్​ (వైఐ) కార్యాలయంలో ఈడీ అధికారులు గురువారం మళ్లీ సోదాలు ప్రారంభించారు. హెరాల్డ్​ బిల్డింగ్​లో మల్లికార్జున్​ ఖర్గేను కూడా విచారించారు. 80 ఏండ్ల ఖర్గే.. యంగ్​ ఇండియన్​ కంపెనీకి ప్రిన్సిపల్​ ఆఫీసర్​గా ఉన్నారు. విచారణకు హాజరుకావాలంటూ ఖర్గేకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేయడంతో.. మధ్యాహ్నం 12.40 గంటలకు ఐటీవో దగ్గరలోని బహుదుర్​ షా జాఫర్​ మార్గ్​బిల్డింగ్​కు చేరుకున్నారు. పార్లమెంట్​ సమావేశాల టైంలో నోటీసులు ఏంటని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. అయితే ఈ కంపెనీలో కాంగ్రెస్​ చీఫ్ సోనియా గాంధీతో పాటు రాహుల్​ గాంధీ ప్రమోటర్లుగా ఉన్నారు. ఇద్దరికీ యంగ్​ ఇండియన్​లో అత్యధికంగా 38 శాతం వాటా ఉంది. 4 అంతస్తుల హెరాల్డ్​ హౌస్​ బిల్డింగ్​లో ఉన్న యంగ్​ ఇండియన్​ ఆఫీస్​ లోని ఓ సింగిల్​ రూంను ఫెడరల్​ ఏజెన్సీ రెండ్రోజుల కింద టెంపరరీగా సీల్​ చేసింది.