
- ఎల్అండ్ టీ లేఖ కుట్రపూరితం
- విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలి: నిరంజన్
హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయడం కుట్రపూరితమని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్జి.నిరంజన్ మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు. ఘటన జరిగిన సమయంలో బ్యారేజీ నిర్వహణ.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలోనే ఉందని ఈఎన్సీ వెంకటేశ్వర్లు ప్రకటించారని, అదే రోజూ తామే పునరుద్ధరిస్తామని ఎల్ అండ్ టీ కూడా ప్రకటించిందని గుర్తుచేశారు.
ఇప్పుడు మాటమార్చడంలో కారణమేంటని నిలదీశారు. ప్రభుత్వం మారినందునే ఎల్ అండ్ టీ తన విధానాన్ని మార్చుకున్నదా? అని ప్రశ్నించారు. అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే బాగుచేస్తామని అనడంలో అంతర్యం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటన పై కేంద్ర ప్రభుత్వం, నాటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతోనే.. ఆ సంస్థ తమ బాధ్యత కాదని చెప్పిందన్నారు. ఈ ఘటన వెనుక గత ప్రభుత్వ కుట్ర ఉందా? అని నిరంజన్ ప్రశ్నించారు.