రాహుల్ గాంధీ రోడ్ షోలు ఫ్లాప్ : మంత్రి సత్యవతి రాథోడ్

రాహుల్ గాంధీ రోడ్ షోలు ఫ్లాప్ : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న రోడ్ షోలు ఫ్లాప్ షోలుగా మారాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు అధికారం రాదని తెలిసి ఆ పార్టీ నాయకులు అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. 2018 ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావన్నారు. కనీసన అవగాహన లేకుండా తెలంగాణ ప్రభుత్వంపై రాహుల్‌‌ గాంధీ విమర్శలు చేస్తున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని కేసులు పెడతారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో బెయిల్‌‌పై ఉన్న రాహుల్ గాంధీనా తమకు నీతులు చెప్పేది అని మండిపడ్డారు.

బతుకమ్మ పండగను అవమానించేలా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగకు అసలైన వైభవం తెచ్చిందే ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. బతుకమ్మను మందు బాటిళ్లు పెట్టి ఆడాలనే జీవన్‌‌ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ప్రియాంక ముందు కూడా మందు బాటిళ్లు పెట్టే బతుకమ్మ ఆడించారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కవితనే కాదు యావత్ మహిళా లోకాన్ని అవమానించే విధంగా ఉన్నాయన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆమె హెచ్చరించారు.