- 5–10 లక్షల మందితో పబ్లిక్ మీటింగ్
- రుణమాఫీ పూర్తి చేసి రైతుల చెంతకు..
- రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే..
- అన్నదాతలకు కాంగ్రెస్ కృతజ్ఞతలు
- అదే రోజు ఉదయం హైదరాబాద్ కు సోనియా
- సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
- కార్యక్రమం తర్వాత ఢిల్లీకి సోనియాగాంధీ
హైదరాబాద్: రైతు రుణమాఫీ పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ లో కృతజ్ఞత సభకు సిద్ధమవుతోంది. 2022 మే 6న వరంగల్ వేదికగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రైతు డిక్లరే షన్ ప్రకటించారు. అందులో భాగంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో దానిని ఆచరణలో పెట్టారు.
నిన్నటితో రైతు రుణమాఫీ పూర్తయింది. దీంతో వరంగల్ లో నిర్వహించే కృతజ్ఞత సభకు రావాలని సీఎం రేవంత్.. రాహుల్ గాంధీని కోరడంతో ఆయన అంగీకరించారు. రాజీవ్ గాంధీ జయంతి రోజైన ఆగస్టు 20న వరంగల్ లో ఈ కృతజ్ఞత సభను నిర్వహించనున్నారు. ఐదు లక్షల నుంచి 10 లక్షల మందితో ఈ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సోనియా చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అదే రోజు ఉదయం ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆవిష్కరించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ వెళ్తారు. అక్కడ జరిగే సభలో రైతులను, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
