ఎంపీ ఈటల ఇంటి ముట్టడి.. కాంగ్రెస్ ​నేతల అరెస్ట్

ఎంపీ ఈటల ఇంటి ముట్టడి.. కాంగ్రెస్ ​నేతల అరెస్ట్

మేడ్చల్/బషీర్​బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం మేడ్చల్ జిల్లా పూడూరులోని ఈటల ఇంటి ముట్టడికి యత్నించారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని పోలీసులను తోసుకుంటూ కాంగ్రెస్ నాయకుల వైపు వెళ్లారు. 

పోలీసులు యూత్ కాంగ్రెస్  నాయకులను అరెస్ట్ చేసి దుండిగల్  పీఎస్​కు తరలించారు. తర్వాత ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ఇంటిని ముట్టడించడం విడ్డూరంగా ఉంది. ఎవరి మాట వినను.. నేను అనుకున్నదే చేస్తా అన్నట్లు వ్యవహరిస్తే సైకో అనక ఇంకేమి అనాలి. రెక్కలు ముక్కలు చేసుకుని ప్రజలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చోద్దని కోరాను. ఆపకపోగా కూల్చివేతలు కొనసాగించారు. ఇలా చేస్తే శాడిస్ట్ కాకుంటే ఏమి అనాలి. 

పరిపాలన మీద రేవంత్ రెడ్డి పూర్తిగా పట్టు కోల్పోయాడు.’ అని ఈటల విమర్శించారు. అలాగే ఎంపీ ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంను సైకో అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడారని పేర్కొన్నారు.