ఇవి దగా ఉత్సవాలు.. దశాబ్ది దగా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసనలు

ఇవి దగా ఉత్సవాలు.. దశాబ్ది దగా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసనలు
  • ర్యాలీగా వెళ్లి తహసీల్దార్​ ఆఫీసుల్లో వినతిపత్రాలు
  • పలు చోట్ల పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం
  • గాంధీభవన్ నుంచి లీడర్లు బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నరు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్/మల్యాల, వెలుగు: తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని కాంగ్రెస్ నేతలు మం డిపడ్డారు. సర్కారు దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ గురువారం ‘దశాబ్ది దగా’ పేరిట కార్యక్రమాలను నిర్వహించింది. పది తలల రావణాసురుడిలా కేసీఆర్ దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేసింది. నేతలు ర్యాలీలుగా వెళ్లి ఎమ్మార్వో ఆఫీసుల్లో వినతిపత్రాలందజేశారు. పలు చోట్ల ఉదయం నుంచే పోలీసులు ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాజీ మంత్రి షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేశారు. గాంధీభవన్​లో పీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. కేసీఆర్ పది తలల దిష్టిబొమ్మను దహనం చేశారు. 

ఇది కచ్చితంగా దశాబ్ది దగానే: రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిరసన తెలియజేయకుండా నేతలను అరెస్ట్ చేయడం పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అరెస్టులు అప్రజాస్వామికమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పోలీసులతో కేసీఆర్ రాజ్యాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. హజ్ యాత్రికులను పంపేందుకు వెళ్తున్న షబ్బీర్ అలీని హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరిట కేసీఆర్ తన పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా దశాబ్ది దగానేనని అన్నారు. బీఆర్ఎస్ సర్కారు మైనారిటీ వ్యతిరేక సర్కారు అని మల్లు రవి విమర్శించారు.

ప్రశ్నిస్తే అరెస్ట్​చేస్తరా?: కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

కేసీఆర్ మోసాలను గుర్తు చేసేందుకే ‘దశాబ్ది దగా’ పేరుతో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దళిత సీఎం మొదలు.. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి హామీలన్నింటినీ కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో నల్గొండ, మహబూబ్​నగర్ ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాళేశ్వ రం కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపిం చారు. రేపో మాపో కవిత అరెస్ట్ అంటూ కిషన్ రెడ్డి, సంజయ్ ఎన్నో సార్లు చెప్పారని, తీరా కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీలో చేరిన నేతలకు అర్థమైందన్నారు. 
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని, అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.

జిల్లాల్లో ఇట్ల

  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అంబేద్కర్ చౌరస్తాకు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంక ట్.. ఏసీపీ వెంకట్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. తర్వాత ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. పాత స్తూపాన్ని కూల్చిన చోట క్షీరాభిషేకం చేసి నివాళి అర్పించారు. 
  • కరీంనగర్​లో మంత్రి గంగుల కమలాకర్ ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చింపేశారు. 
  • దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా.. వాగ్వాదం జరిగింది.
  • జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ నాయకులు ఆందోళన చేశారు. ఇందిరా భవన్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ తీసి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మెట్​పల్లి, కోరుట్ల, గోదావరిఖని, సిరిసిల్ల,పెద్దపల్లి పట్టణ కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాల పేరిట కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడని, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో పాల్గొని, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 
  • కామారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్​లో కాంగ్రెస్​శ్రేణులు కేసీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు. నల్గొండలో పదితలల కేసీఆర్​ ఫ్లెక్సీని దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత ఏర్పడింది.
  • సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోదాడలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి, మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ఆందోళనల్లో పాల్గొన్నారు.
  • మంచిర్యాలలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తాలో, బెల్లంపల్లి పట్టణంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆదిలాబాద్, నిర్మల్​లో కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.
  • హనుమకొండలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యం లో పది తలల కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వంటా వార్పు నిర్వహించారు.
  • ములుగు, నర్సంపేటలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.