పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంటూ బన్సీలాల్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై రాంగోపాల్‌పేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు త్రికాల మనోజ్ కుమార్ మహంకాళి పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశారు.
రేవంత్ రెడ్డిని ‘ముక్కలు చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఇవి ప్రజల్లో ఉద్రిక్తతకు దారితీసే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తలసాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
