బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, పాల్వాయి హరీశ్

బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్, పాల్వాయి హరీశ్

సంజయ్​తో మంతనాలు
పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి కాంగ్రెస్ నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్​లోని నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి మహ్మద్ ఫిరోజ్ ఖాన్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పాల్వాయి హరీశ్ బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ స్టేట్​చీఫ్ బండి సంజయ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్​లో మంగళవారం జరిగే సభలో పార్టీ స్టేట్​ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో హరీశ్ పార్టీలో చేరనున్నారు.  ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు చేరతారో ఖరారు కాలేదు.

పాతబస్తీలో పట్టున్న ఫిరోజ్

పార్టీలో చేరికపై ఫిరోజ్ ఖాన్ ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో మూడు దఫాలుగా చర్చించారు. పార్టీ నుంచి అనుమతి తీసుకున్న సంజయ్.. ఫిరోజ్ జాయినింగ్​కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన తన అనుచరులతో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి కాషాయ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2009 లో పీఆర్పీ నుంచి, 2014 లో టీడీపీ నుంచి, 2018 లో కాంగ్రెస్ నుంచి నాంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి సుమారు 50 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ మజ్లీస్ పార్టీకి ప్రతి ఎన్నికల్లో ఆయన గట్టి పోటీ ఇస్తున్నారు. పాత బస్తీలో పట్టు కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి ఫిరోజ్ ఖాన్ వంటి బలమైన నేత పార్టీలో చేరడంతో కమల దళం వ్యూహాలు ఫలించనున్నాయి.

ఇయ్యాల చుగ్ సమక్షంలో చేరనున్న హరీశ్

మంగళవారం తరుణ్ చుగ్ సమక్షంలో హరీశ్ పార్టీలో చేరనున్నారు. ఇందుకోసం బండి సంజయ్​తో కలిసి కాగజ్​ నగర్​లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. హరీశ్​ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై హరీశ్ ఫైర్ అయ్యారు. ‘కాంగ్రెస్​కు 2 వారాల కిందటే రాజీనామా చేశా. రిజైన్ చేశాక సస్పెండ్ ఏంటి? సస్పెండ్ చేయటానికి కాంగ్రెస్​లో ఎవరున్నారు? కాంగ్రెస్ స్టేట్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి తనను ఎట్ల సస్పెండ్ చేశారు’ అని అడిగారు. గాంధీభవన్ తాళాలు ప్రగతి భవన్ లో ఉన్నాయని.. ముందు ఆ సంగతి తేల్చుకోవాలని విమర్శించారు.