ఇక్కడ లడాయి.. అక్కడ దోస్తీ.. నీడ పడనివ్వమంటున్న రేవంత్

V6 Velugu Posted on Dec 02, 2021

హైదరాబాద్​, వెలుగు: టీఆర్ఎస్​తో ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు కుస్తీ పడుతుంటే.. అక్కడ ఢిల్లీలో మాత్రం ఆ పార్టీ హైకమాండ్​ దోస్తీ చేస్తున్నది. టీఆర్​ఎస్​ ఎంపీలతో కలిసి కాంగ్రెస్​ పెద్దలు దగ్గర దగ్గరగా తిరుగుతున్నారు. పార్లమెంట్​లో కలిసి నిరసనలు చేస్తున్నారు. మీటింగ్​లు పెట్టుకుంటున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్​ నేతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పోరాటం చేయాల్సిన పార్టీతో దోస్తానా ఏందని కొందరు లీడర్లు ప్రశ్నిస్తుంటే.. ఇది మంచి పరిణామమేనని,  రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేందుకు కలిసి వస్తుందని ఇంకొందరు అంటున్నారు. అయితే, తమ పార్టీపై టీఆర్​ఎస్​ నీడ కూడా పడనివ్వనని పీసీసీ చీఫ్​ రేవంత్​  తేల్చిచెప్పారు.

గల్లీలో నువ్వా నేనా..
అనేక అంశాల్లో అధికార టీఆర్​ఎస్​ తీరును రాష్ట్ర కాంగ్రెస్​ లీడర్లు తప్పుబడుతూ గల్లీ గల్లీలో ఆందోళనలకు దిగుతున్నారు. ముఖ్యంగా వడ్ల కొనుగోళ్ల విషయంలో కేసీఆర్​ పూటకో మాట మాట్లాడుతున్నారంటూ నెల రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు. ‘కల్లాల్లోకి కాంగ్రెస్’ పేరిట పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సహా పార్టీ లీడర్లు జిల్లాల బాట పట్టారు. వడ్లు కొనకుండా రాష్ట్ర సర్కారు రైతుల ఉసురుపోసుకుంటున్నదని మండిపడ్డారు. బుధవారం గవర్నర్​ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అదే టీఆర్​ఎస్​తో కాంగ్రెస్​ హైకమాండ్​ ఢిల్లీలో దోస్తానా చేయడం ఆసక్తికరంగా మారింది. 

ఏమైనా జరగొచ్చంటున్నరు!
జాతీయ రాజకీయాలనే ప్రధానంగా భావించే కాంగ్రెస్​ హైకమాండ్​.. రాష్ట్రాల్లో తాము వ్యతిరేకించే పార్టీలతో కూడా జట్టు కట్టిన ఉదాహరణలనేకం ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్, టీఆర్​ఎస్​ మధ్య ముచ్చట్లు చూస్తే రాష్ట్రంలో మున్ముందు ఏమైనా జరగొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

టీఆర్​ఎస్​ను బద్ధ శత్రువులుగా భావించే కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా దీన్ని పూర్తిగా కొట్టేయలేకపోతున్నారు. ‘అట్లా ఉండదు’ అంటూనే, ‘మరి హైకమాండ్​ ఏం ఆలోచన చేస్తున్నదో’ అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోవడం ఇష్టం లేని ఇంకొందరు కాంగ్రెస్​ లీడర్లు.. బీజేపీని నిలువరించేందుకు టీఆర్​ఎస్​తో దోస్తీ చేస్తే తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు, హుజూరాబాద్​ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం లాంటి అంశాలు కొందరు కాంగ్రెస్​ నేతలను కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న తమ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తోందా అని ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి లీడర్లు ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను స్వాగతిస్తున్నారు. ‘‘సైద్ధాంతికంగా మాకు బీజేపీ బద్ధ శత్రువు. జాతీయ స్థాయిలో ప్రధాన శత్రువు. అలాంటి పార్టీ రాష్ట్రంలో బలపడితే భవిష్యత్తులో కాంగ్రెస్​ నిలదొక్కుకోవడం కష్టం. దీన్ని వెంటనే అడ్డుకోకపోతే రాష్ట్రంలో మా పార్టీని మరిచిపోవచ్చు’’ అని కాంగ్రెస్​ ముఖ్య నేత ఒకరు చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో దోస్తీ చేస్తూనే రాష్ట్రంలో టీఆర్​ఎస్​తో తలపడవచ్చని ఆయన అన్నారు. ఇలాంటి సంప్రదాయం కాంగ్రెస్​కు కొత్తేమీ కాదని గుర్తుచేశారు. కేరళలో కమ్యూనిస్టు, బెంగాల్​లో తృణమూల్​ పార్టీతో తలపడుతూనే జాతీయ స్థాయిలో వారితో కలిసి పని చేశామని చెప్పుకొచ్చారు. 

ఎలాంటి సంబంధం లేదు: దాసోజు
జాతీయ స్థాయి అంశాల్లో టీఆర్​ఎస్​తో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో ఆ పార్టీతో తలపడడానికి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్​ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ అన్నారు. అనేక రాష్ట్రాల్లో తాము అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని చెప్పారు.  ‘‘ఏడేండ్లు బీజేపీతో స్నేహం చేసిన కేసీఆర్​ ఇప్పుడు మారిపోతాడంటే కాంగ్రెస్​ నమ్మదు. రాష్ట్రంలో మేం రెండో ప్లేస్​లో ఉన్నం. బీజేపీ స్థానం మూడోది. అది మొదటి స్థానంలోకి రాదని కేసీఆర్​కు తెలుసు. మమ్మల్ని వెనక్కి నెట్టి బీజేపీని రెండో స్థానానికి తెచ్చేందుకు కూడా కేసీఆర్​ ప్లాన్​ చేయొచ్చు. ఆయన వ్యూహం అదే అనుకుంటున్న’’ అని అన్నారు. కేసీఆర్​, బీజేపీ కొట్లాట డబ్ల్యూడబ్ల్యూఎఫ్​లా ఉత్తుత్తిదేనని విమర్శించారు. అయితే తమ హైకమాండ్​ ఆలోచన మాత్రం తనకు తెలియదని దాసోజు అన్నారు. 

రాహుల్​, కేకే ముచ్చట్లు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తాడో పేడో తేల్చుకుంటామని ఇటీవల 
టీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ బహిరంగంగా ప్రకటించారు. ఇదే క్రమంలో టీఆర్​ఎస్​ ఎంపీలు పార్లమెంట్​ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల పాటు తమ ఆందోళన కొనసాగించారు. ఢిల్లీలో టీఆర్​ఎస్​ ఆందోళనకు కాంగ్రెస్​ మద్దతు పలుకుతున్నది. కాంగ్రెస్​ చేపట్టే నిరసనల్లో టీఆర్​ఎస్​ పాల్గొంటున్నది. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్​ను వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రతిపక్ష పార్టీలతో కాంగ్రెస్​ నిర్వహించిన మీటింగ్​కు టీఆర్​ఎస్ ​సెక్రటరీ జనరల్​, ఎంపీ కె.కేశవరావు హాజరయ్యారు. కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ పక్కనే ఆయన కూర్చొని ముచ్చటించారు. 

తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్న మరో వర్గం
ఢిల్లీలో టీఆర్​ఎస్​తో కాంగ్రెస్​ హైకమాండ్​దగ్గరగా ఉండడాన్ని రాష్ట్ర కాంగ్రెస్​లోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇది మంచి పరిణామం కాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ వర్గం లీడర్లు అంటున్నారు. తాము ఇక్కడ పోరాటం చేస్తున్న పార్టీతోనే ఢిల్లీలో దోస్తీ కట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రైతుల కష్టాలకు, వడ్ల కొనుగోళ్లలో గందరగోళానికి కారణమైన టీఆర్​ఎస్​ను నిలదీయాల్సిన టైంలో ఆ పార్టీ నేతలతో ఢిల్లీలో కలిసి నిరసనల్లో పాల్గొనడం సరి కాదంటున్నారు. తమ పార్టీపై టీఆర్​ఎస్​ నీడ కూడా పడనివ్వబోనని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి  ఇప్పటికే తేల్చిచెప్పారు. 

Tagged tpcc chief revanth reddy, congress vs trs, trs congress dosthi

Latest Videos

Subscribe Now

More News