
- నేడు కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ
- కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ బీసీ ముఖ్య నేతలు గురువారం ఉదయం కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జరిగిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ అగ్ర నేతలకు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వివరించనున్నారు.
బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపై చర్చించనున్నారు. ఈ నెల 25న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి చీఫ్ గెస్టులుగా ఖర్గే, రాహుల్ హాజరుకానున్నారు. ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర బీసీ నేతలు పాల్గొననున్నారు.
బీసీ బిల్లు కోసం పార్లమెంట్ ను స్తంభింపజేస్తం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
బీసీ బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్ ను స్తంభింపజేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ బిల్లు ఆమోదం కోసం బీఆర్ఎస్, బీజేపీలోని బీసీ నేతలంతా ఆ పార్టీలకు రాజీనామా చేసి, కాంగ్రెస్ తో జతకట్టాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటే బీజేపీకి రుచించడం లేదని, 9వ షెడ్యూల్ లో చేర్చడం ఎందుకు అసాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఉన్న రిజర్వేషన్లను తగ్గించి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని ఆయన విమర్శించారు. అగ్ర కులాల ఆధిపత్యాన్ని ఎదిరించి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని మహేశ్‌గౌడ్ కోరారు.