న్యూఢిల్లీ: పాలనలో ప్రతిఒక్కరినీ కలుపుకొని వెళ్లాలనే ధోరణిని కాంగ్రెస్ పార్టీ అవలంబించిందని, దేశాభివృద్ధికి ఇదే దోహదం చేసిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. కొన్ని దశాబ్దాలలోనే మన దేశం విజయవంతమైన ప్రజస్వామ్య దేశంగా అవతరించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ, న్యూక్లియర్, వ్యూహాత్మక రంగాల్లో కూడా సూపర్ పవర్‌గా మారిందని ఆయన తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటీ, సేవల రంగాల్లోనూ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు.
దేశ సరిహద్దులు, పౌరుల హక్కులను కాపాడే విషయంలోనూ కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని, అది తమ పార్టీ ప్రతిజ్ఞ అని పేర్కొన్నారు. యూపీఏ హయాంలో తెచ్చిన వివిధ చట్టాలే అందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. ‘‘దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పనిచేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులు, సమాన అవకాశాలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఉంది. పార్టీ ఏర్పడి 137 ఏండ్లు గడచిపోయినయ్. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినయ్. ఈ 75 సంవత్సరాల్లో దేశం సాధించిన ఎన్నో ఘనతలు, మైలురాళ్లలో కాంగ్రెస్ మార్క్ ఉంది. వేల ఏండ్లు సాంఘిక దురాచారాల్లో చిక్కుకున్న పేదలు, దళితులు, అణగారిన వర్గాలను ఎంతో ధైర్యంగా కాంగ్రెస్ విముక్తి చేసింది. వారి అభివృద్ధి కోసం పనిచేసింది’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
.కేంద్రంపై విమర్శలు..
ద్వేషంతో సమాజాన్ని విడగొట్టారని, దేశ పునాదులపై అదేపనిగా దాడులు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో కేంద్రం దేశ ప్రజల నడ్డి విరుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజల ఇబ్బందుల గురించి కేంద్రానికి కొంచెం కూడా పట్టింపులేదని ఫైరయ్యారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఖర్గే ముంబై వెళ్లారు. కాగా, అహింసా మార్గాన్ని ఎంచుకొని, ప్రజా సంక్షేమం కోసం పోరాడిన కాంగ్రెస్‌లో తాను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నానని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
జోడో యాత్రలో రాహుల్‌కు భద్రత పెంచాలె
భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి భద్రత పెంచాలని బుధవారం సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షాకు కాంగ్రెస్ లేఖ రాసింది. రాహుల్ యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించిన సమయంలో అనేక భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఏఐసీసీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లెటర్లో పేర్కొన్నారు. హర్యానాలో కొందరు దుండగులు యాత్రా శిబిరంలోకి కూడా చొరబడ్డారని ఆయన తెలిపారు. శనివారం యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించిన తర్వాత జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్ గాంధీ చుట్టూ రద్దీని కంట్రోల్ చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఫెయిల్అయ్యారని ఆరోపించారు. దీంతో రాహుల్‌తో నడిచే కార్యకర్తలు వలయాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చిందన్నారు. ఢిల్లీ పోలీసులు మూగ ప్రేక్షకులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తల్లితో రాహుల్ గాంధీ ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్
.
కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ తన తల్లితో సరదాగా ఉన్నారు. తన తల్లి ముఖాన్ని నిమురుతూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

