
- ధరణి స్థానంలో భూమాత
- భూకమతాలు సర్వే చేసి రైతులకు భూమి హక్కులు,
- భూధార్ కార్డులుల్యాండ్ కమిషన్ పెట్టి ప్రభుత్వ భూములకు రక్షణ
- మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి మరింత మెరుగైన రెవెన్యూ సేవల కోసం ‘భూమాత’ పేరిట పోర్టల్‌ను తీసుకొస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. భూమి హక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేసేలా.. సమగ్ర భూ కమతాల సర్వే చేపట్టి, తిరిగి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ఆ సర్వే ద్వారా ప్రతి రైతులకూ ‘భూధార్ కార్డ్’ను అందజేస్తామని తెలిపింది. కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ల్యాండ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రజల భూములను, భూమి హక్కులను కాపాడేందుకు సమగ్రమైన రెవెన్యూ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
భూసంస్కరణల ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై ఆ పేదలకే పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో ఎవరి మధ్యనా భూమి కొట్లాటలు, వివాదాలు లేకుండా ఉండేలా పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. భూయజమానికి పూర్తి హక్కులను కల్పించడమే ధ్యేయమని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తొలగిస్తామని స్పష్టం చేసింది.