పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది: జగ్గారెడ్డి

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది: జగ్గారెడ్డి

తనను కాంగ్రెస్ పార్టీ వదిలించుకుంటేనే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను కోవర్ట్ అంటూ ముద్రవేస్తే.. పార్టీ నాయకులు కనీసం ఖండించలేదని ఆయన వాపోయారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని.. తాను కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

‘పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నాను. అన్ని అంశాలను సోనియా గాంధీకి, పార్టీ పెద్దలకు లేఖలో తెలియజేస్తాను. టీఆర్ఎస్‎లోకి వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను.  నేను ఏ పార్టీలోకి వెళ్ళను. నేను కాంగ్రెస్ సైనికుడిని. స్వతంత్రంగానే ఉంటూ సంగారెడ్డి ప్రజలకు సేవ చేస్తాను. నాపై కోవర్ట్ ముద్ర వేస్తే.. పార్టీ నుంచి మద్దతు కూడా లభించలేదు. పైగా ఆ ఆరోపణలను నేతలు ఖండించలేద కదా.. కనీసం విచారణ జరిపించే స్థితిలో కూడా పార్టీ నేతలు లేరు. నాపై కోవర్ట్ అనే ముద్ర కొంతమంది కావాలనే వేశారు. ఆ ప్రచారం నాకే కాదు.. పార్టీకి కూడా నష్టమే. అందుకే పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది. అయినా మంత్రులను కలవడంలో తప్పేం ఉంది. మా నాయకుడు రాహుల్ గాంధే పార్లమెంట్‎లో పీఎంని  కౌగిలించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీఎంని కలవలేదా? నేను కలిస్తే తప్పెంటి? ఈ విషయంపై మా పార్టీ నేతలు ఎవరూ నన్ను కలవాల్సిన అవసరం లేదు’ అని జగ్గారెడ్డి అన్నారు.