
- అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నరు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- కాళేశ్వరంతో ఒరిగిందేమీ లేదు
- హరీశ్ రావు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలతో పుట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ చేసినవన్నీ అబద్ధాలే అని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్నే సీఎం సభ ముందు ఉంచారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడారు. ‘‘రేవంత్‌పై హరీశ్ చేస్తున్నవి అర్థం లేని ఆరోపణలు. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడ్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నది బీఆర్ఎస్ కాదా? మేడిగడ్డ బ్యారేజీ కుంగితే అపోజిషన్ పార్టీ నేతలు, మీడియాను పోలీస్ ఫోర్స్‌తో అడ్డుకున్నది మీరు కాదా?’’అని అన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిక్నిక్కు వెళ్లి వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి ఇంజినీర్లు, 80వేల పుస్తకాలు చదివిన మేధావులు కాంగ్రెస్‌లో లేరన్నారు.
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్‌పై ఆ పార్టీ నేతలు అభాండాలు వేస్తున్నరు. అబద్ధాలు మాట్లాడటంలో హరీశ్‌కు ఎవరూ సాటిరారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జైపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రిలేషన్షిప్ గురించి మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదు. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో బలయ్యారు. కానీ.. మీ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రాణ త్యాగం చేయలేదు.
– దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
ఒక్క ఇంటికి నీళ్లివ్వలేదు
రూ.30వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు పెంచారు. ఒక్క ఇంటికి కూడా నీరు ఇవ్వలేకపోవడం దౌర్భాగ్యకరం. వాళ్ల అడుగులకు మడుగులొత్తే ప్రభాకర్ రావును సీఎండీగా పెట్టి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులే.. సాగు, తాగునీరు అందిస్తు న్నాయి. మాటల గారడీతో బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెడ్తున్నరు.
– గండ్ర సత్యనారాయణ రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు చెడ్డపేరు తెచ్చారు
బీఆర్ఎస్ హయాంలో పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టుకుపోయింది. పదేండ్ల పాటు పోలీస్ శాఖను చేతిలో పెట్టుకుని ట్రాన్స్ఫర్లు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్‌కు చెడ్డ పేరు తెచ్చారు. బీఆర్ఎస్ పాలనలో హత్యలు జరిగాయి. అప్పుడు నోరు మెదపని వాళ్లు.. ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నరు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నరు.
– నాగరాజు, వర్ధన్నపేట ఎమ్మెల్యే
సభను తప్పుదోవ పట్టిస్తున్నరు
విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరుగుతుంటే.. సభను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది కోట్ల ప్రజా ధనాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తి చేయలేదు. ఇష్టమొచ్చినట్లు డిజైన్లు చేసి ప్రాజెక్టులు కట్టిన్రు. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పిన్రు. – కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే