ప్రైవేట్ యూనివర్సిటీలతో పేద విద్యార్థులకు అన్యాయం

ప్రైవేట్ యూనివర్సిటీలతో పేద విద్యార్థులకు అన్యాయం

హైదరాబాద్: ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఐదు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతాయని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు అధిక శాతం  చదువుతారని,  కానీ ప్రైవేట్ యూనివర్సిటీలతో ఆయా వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులో రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 25 శాతం సీట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. ప్రభుత్వమే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తోందని, సామాజిక తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మన ఊరు – మన బడి నామ మాత్రపు ప్రకటనలకే పరిమితమైందని, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎక్కడా కనబడటం లేదని ఆరోపించారు. 

విద్యార్థులు, నిరుద్యోగుల బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో.. వాళ్లకే స్థానం లేకుండా పోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వాపోయారు. సరైన వసతులు, బోధనా సిబ్బంది కల్పించకుండా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. యూజీసీ గైడ్ లైన్స్ పేరుతో విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో A క్యాటగిరీలో మాత్రమే స్థానికులకు సీట్లు ఇస్తున్నారని, B క్యాటగిరీలో 40 శాతం, C క్యాటగిరీలో 10 శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లకు సీట్లు అమ్ముకుంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.. కోట్లు దండుకుంటున్నాయని ఆరోపించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జమ్మూకశ్మీర్ తరహాలో బీ, సీ క్యాటగిరీల్లోనూ స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.