దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలి

దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలి
  • రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేను కేసీఆర్ ఎప్పుడో  సృష్టించారు
  • దేశంలో  కేసీఆర్ అంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు లేరు
  • మోడీ, కేసీఆర్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారు
  • పోడు భూముల సమస్య తీర్చడానికి కేసీఆర్ కు కుర్చీ దొరకడం లేదా అని జీవన్ రెడ్డి ప్రశ్న

కేసీఆర్ 2014లోనే రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేను సృష్టించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను బలహీనపరిస్తే బలపడతారని భావించిన కేసీఆర్...దాని పర్యావసానం త్వరలో  చూస్తారని విమర్శించారు.  దేశంలో  కేసీఆర్ అంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు లేరని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న ఒక  దొంగ, రాష్ట్రంలో మరో ఈ దొంగ.. ఈ ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి.. సీఎం కేసీఆర్ అన్యాయంగా గిరిజనుల నుంచి భూములను లాక్కుంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్య తీరుస్తానన్న కేసీఆర్కు కుర్చీ దొరకడం లేదా ఎద్దేవా చేశారు. గిరిజనులకు కల్పించాల్సిన 10 రిజర్వేషన్ను కల్పించకుండా వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. దళితులకు ఇవ్వాల్సిన మూడెకరాలకు ఇవ్వకుండా పది లక్షల రూపాలయతో మభ్యపెడుతున్నారని  మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లీంచారని ఆరోపించారు. దళితులు, గిరిజనులు వివక్షకు గురవుతున్నారంటే అది కేసీఆర్ అసమర్థ పాలన వలనే అన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.  జాతీయ పార్టీ పెడతా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటూ ఊకదంపుడు మాటలు మాని..రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు.