మోడీ పొగడ్తలకు ఆజాద్ పొంగిపోవడం దురదృష్టకరం

మోడీ పొగడ్తలకు ఆజాద్ పొంగిపోవడం దురదృష్టకరం

ప్రధాని మోడీ మోడీ పొగడ్తలకు గులాం నబీ ఆజాద్ పొంగిపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లడం సరైన పద్ధతి కాదని, గతంలో పదవులను అనుభవించిన వ్యక్తిగా ప్రస్తుతం పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత గులాం నబీ ఆజాద్ పై ఉందన్నారు. మోడీని తప్పుపట్టాలా..? లేక ఆయన ప్రలోభాలకు లొంగిపోతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలను తప్పుపట్టాలా..? అని వ్యాఖ్యానించారు.

ఇందిరాగాంధీ కుటుంబంతో అత్యంత సన్నిహితులుగా ఉండే వాళ్ళే.. ఇప్పుడు పదవుల కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లడం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాలకపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తాయని, వాటికి లొంగడం నేతల తప్పేనని చెప్పారు. స్వార్థ రాజకీయాలకు ఒక హద్దు ఉంటుందని.. ఆజాద్ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జాతి సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.

2004, 2014 మధ్యకాలంలో యూపీఏ పాలన ఒక స్వర్ణయుగమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో 70 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి బీజేపీ చేసిందేమి లేదని, కులం, మతం, ఎమ్మెల్యేలు, ఎంపీల కొనుగోలే వారి అభిమతని విమర్శించారు. బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడం సహా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు జాతి సమగ్రతను దెబ్బ తీస్తున్నాయని ఆరోపించారు. నిత్యావసర సరుకుల ధరలు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ ఆస్తులను విక్రయించడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని మండిపడ్డారు.