పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: జీవన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ అనైతిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీతి, నిజాయితీ, పారదర్శకతతో కూడిన పాలన సాగిస్తారని ఆశిస్తే..కేసీఆర్ మాత్రం ఇష్టారాజ్యంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు దొంగలే అని విమర్శించారు. టీఆర్ఎస్ బాటలోనే బీజేపీ నడుస్తోందన్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల కొనుగోలుకు తెరలేపి.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రెండు పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి..

తలసాని శ్రీనివాస్ యాదవ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, భాస్కర్ రావు, రెడ్యా నాయక్లను  ఏ రాజ్యాంగ నిబంధనలకు లోబడి టీఆర్ఎస్లో చేర్చుకున్నారో కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయిపులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి సభ్యత్వం రద్దు చేయాలని జానారెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేసినా వారి పదవి కాలం పూర్తయ్యేవరకు కూడా చర్యలు తీసుకోలేదన్నారు.

పార్టీ ఫిరాయింపులకు రోల్ మోడల్గా తెలంగాణ

పార్టీ ఫిరాయింపుల్లో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో నైతికత కోసం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్ల కొనుగోలును చూసి దేశం ఆశ్చర్య పోతోందన్నారు.