
ప్రజల ఆస్తుల వివరాలు గ్రామ పంచాయతీ రికార్డులలో నిక్షిప్తమై ఉన్నా….మళ్ళీ ఆన్‌లైన్ ఆస్తుల వివరాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు సర్వే చేపడుతుందో అర్థం కావట్లేదన్నారు కాంగ్రెస్ నేతలు. శుక్రవారం సాయంత్రం జూమ్ ఆప్ ద్వారా పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంఎల్సీ జీవన్ రెడ్డి, మాజీ జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి విజయరామ రాజు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య లు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ నాటి వాల్యూ ఆధారంగా ఎల్ ఆర్ ఎస్ రుసుము ఉంటుందని సభాముఖంగా మంత్రి చెప్పినా..అమలు చేయట్లేదన్నారు. రాష్ట్ర ఖజానా నింపు కోవడం కోసమే.. ఎల్ఆర్ఎస్ తెచ్చారని, పన్నుల భారం మోపేందుకే మళ్ళీ సర్వే లు చేస్తున్నారని ఆయన అన్నారు. న్యాయ స్థానంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పదని అన్నారు
కాంగ్రెస్ అధికారంలో కి వచ్చాక ఎల్ఆర్ఎస్ ను ఉచితం గా చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్ ,నో టీఆర్ఎస్.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.
రిటైర్డ్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విష్ణు వర్దన్ రాజు మాట్లాడుతూ.. అక్రమ ఫ్లాట్లను సక్రమం చేయడం మంచిదే…కానీ ఉచితం గా చేయాలన్నారు. తెలంగాణ లో 80శాతం ఫ్లాట్లు గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్లేనని, 3 ఫ్లాట్లు అక్రమం అంటూ ప్రభుత్వమే చెబుతుందన్నారు. అంటే ఈ 80 శాతం ప్రజల ను ప్రభుత్వం దొంగలుగా భావిస్తుందన్నారు. గతంలో అక్రమ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు జరిమానా కట్టాలని అన్నారు.
సామాన్యులకు ఫ్లాట్ రుసుము ఎలా లెక్కట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. లే అవుట్ చేసిన వారిని , ఫ్లాట్ ను అప్రూవ్ చేసిన వారిని ,రిజిస్ట్రేషన్ చేసిన వారిని శిక్షించకుండా..ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిని శిక్షించడం సమంజసం కాదని, ఈ స్కీమ్ లో మానవతా కోణం లోపించి..ఆర్థిక కోణం పెరిగిందన్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయకుండా జీవో ఇచ్చారన్నారు.