మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనది :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైనది :ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు దొంగ ఆటలు ఆడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటి వరకు స్థానిక నాయకుల కొనుగోలే జరిగిందని..ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ వికృత క్రీడకు పరాకాష్ట అని విమర్శించారు. గతంలో ఎమ్మె్ల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని..ప్రస్తుతం టీఆర్ఎస్ బాటలో బీజేపీ నడుస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎంచుకున్న నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లిన వారే అని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మె్ల్యేలను లొంగదీసుకోవడం ఈజీ అనుకునే..బీజేపీ వారిని ఎంచుకున్నట్లు ఉంది అభిప్రాయపడ్డారు. 

టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలి..

రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కేసీఆర్ కుట్ర అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గతంలో తలసాని  శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి లాంటి వారిని టిఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం కేసీఆర్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళు అనేది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ వ్యవహారం ఎన్నికల కమిషన్ కిందకు వస్తుందని..దీనిపై ఈసీ విచారణ చేయాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయాలన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనడం సంతోషమని చెప్పారు. అయితే దీనిపై కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయాలని సూచించారు. దేవుడి మీద ప్రమాణాలు అయ్యేటివి కావు..పొయ్యేటివి కావని కొట్టిపారేశారు. అటు మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నిక అని తెలిపారు. మునుగోడులో మద్యం ఏరులై పారుతోందన్నారు.