రక్షణకు కేటాయించే బడ్జెట్ను భారంగా భావించొద్దు

రక్షణకు కేటాయించే బడ్జెట్ను భారంగా భావించొద్దు

అగ్నిపథ్ను కేంద్రం తక్షణమే నిలిపివేసి..గతంలో ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మీ ఉద్యోగాల కోసం ఇప్పటికే ఫిజికల్ టెస్టులు పాసైన వారికి రాత పరీక్ష పెట్టకుండా నోటిఫికేషన్ రద్దు చేయడంతో దేశమంతా యువకులు తిరుగబడుతున్నారని అన్నారు. సికింద్రాబాద్ అల్లర్లలో  పోలీసులు ముందుగా రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ లాంటివి వాడకుండా నేరుగా ఫైరింగ్ చేశారని ఆరోపించారు. అనివార్యంగా కాల్పులు జరపాల్సి వస్తే కాళ్లకు కాలుస్తారు..కానీ ఛాతిలోకి బుల్లెట్ ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. బడ్జెట్ కుదించేందుకే అగ్నిపథ్ స్కీం తెచ్చారన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి దేశం కోసం సేవలందించే  సైనికులకు తక్కువ జీతంతోపాటు తక్కువ సర్వీసా అని నిలదీశారు. చివరకు రక్షణకు సంబంధించి కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి దేశం దిగజారిపోవడం బాధాకరమని..రక్షణకు కేటాయించే బడ్జెట్ ను భారంగా భావించొద్దని  చెప్పారు.  

పొరుగు దేశాల అధ్యక్షులు మన దేశ అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఎందుకు వచ్చిందని జీవన్ రెడ్డి అడిగారు. నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజార్చాయని..మోడీ భారత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్ర నిరుద్యోగులు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమ కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను సీఎం కేసీఆర్ ఏ మేరకు నెరవేర్చారో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ మొన్నటి మమత బెనర్జీ మీటింగ్ కు గైర్హాజరు కావడం ద్వారా ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు విఘాతం కలిగించారని..ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేస్తే..టీఆర్ఎస్ వేయదా అని ప్రశ్నించారు.