ప్రచార ఆర్భాటాలకే టీఆర్ఎస్ ప్రాధాన్యం

ప్రచార ఆర్భాటాలకే టీఆర్ఎస్ ప్రాధాన్యం

టీఆర్ఎస్ పాలనలో అర్హులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అర్హులకు పెన్షన్లు ఇవ్వకుండా 44 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వృద్దులను గోస పెడుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటలకే  ప్రాధాన్యం ఇస్తోందని.. ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. జగిత్యాల జిల్లాలోని ఇందిరాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లను మార్చి టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించలేని అసమర్ద సీఎం కేసీఆర్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

బొగ్గు, నీరు అందుబాటులో ఉన్న దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కమీషన్ల కోసం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు మొదలుకొని బీజేపీ తీసుకొచ్చిన పలు పథకాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ హక్కు అన్నారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్, రైతుల కరెంట్ బకాయిల రద్దు ఫైలు పైనే మొదటి సంతకం చేశారని తెలిపారు. 

సీఎం కేసీఆర్ కు పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ నిరుపేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారుల కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు, అన్ని మతాల ధార్మిక కార్యక్రమాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.